బీజేపీ ఆశలు గల్లంతు... మోడీ ఇప్పుడేం చేస్తాడో       2018-07-09   00:57:08  IST  Bhanu C

‘జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ కసరత్తు ప్రారంభించింది. దీనిపై తమ తమ అభిప్రాయాలూ చెప్పాలంటూ.. లా కమిషన్ ద్వారా పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కేంద్రం ఆశలు అడియాసలు చేస్తూ రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాయి. జమిలి ఎన్నికలు తమకు ఏమాత్రం ఇష్టం లేదని లా కమిషన్ ఎదుట మెజార్టీ రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికలపై కేంద్రం ఎలా ముందుకు వెళ్తుంది అనేది అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.

ముందస్తు ఎన్నికలపై రెండు రోజుల పాటు లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో బీజేపీకి సన్నిహితంగా ఉండే నాలుగు పార్టీలు మాత్రమే ఈ ఎన్నికలకు మొగ్గు చూపుతున్నామని చెప్పగా… తొమ్మిది పార్టీలు వ్యతిరేకత తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పలేదు. కానీ తాను జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు.. గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. లాకమిషన్ కు అభిప్రాయం చెప్పబోమని గతంలో ప్రకటించింది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే… మెజార్టీ పార్టీలు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్నట్టు స్ప్రష్టంగా అర్ధం అవుతోంది.

జమిలి ఎన్నికలపై చాలా పార్టీలకు సదభిప్రాయం లేదు. కేవలం ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికే బీజేపీ ఈ ప్రతిపాదన తీసుకువచ్చిందని, దేశంలో ఇప్పటి వరకూ జరిగిన జమిలీ ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ.. ఒకే పార్టీ గెలిచినా సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. జమిలీ ఎన్నికలు జరిగితే.. రెండు ఓట్లు ఒకే పార్టీకి వేసే సంప్రదాయం భారత ఓటర్లలో ఉందని, దాని ద్వారా లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే కేంద్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తుపై ముందుకే వెళ్లాలని చూస్తోంది. ఈ ప్రతిపాదన రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో మోదీ అండ్ కో బృందం ఆలోచిస్తున్నారు. రూల్ ప్రకారం లా కమిషన్ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. కానీ మెజార్టీ రాష్ట్రాల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నఖచ్చితమైన రూల్ ఏమీ లేదు కాబట్టి దీనిపై ముందుకే వెళ్లాలని బీజేపీ చూస్తోంది.