బీజేపీకి చిత్తశుద్ధి లేదా ..? ఏపీపై ఎందుకీ గందరగోళం !       2018-06-19   00:39:21  IST  Bhanu C

విభజన కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం సహాయం చేయకపోగా .. బీజేపీ నాయకులు పూటకో మాట .. గంటకో ప్రకటన చేస్తూ .. గందరగోళం సృష్టిస్తున్నారు. బీజేపీ పెద్దలే కాదు ఏపీ నేతలు కూడా ఇదే విధంగా గందరగోళ ప్రకటనలు చేస్తూ అయోమయం సృష్టిస్తున్నారు. విశాఖ రైల్వేజోన్‌ ఖాయమని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తుంటే.. ఇంకా పరిశీలనలోనే ఉందంటూ కేంద్రమంత్రులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఇదే విధంగా ఒకరికొకరు సంబంధంలేని ప్రకటనలు చేస్తున్నారు.

-

విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు అంశంపై.. రైల్వేమంత్రి పీయూష్‌ గోయాల్‌ ఇంకా పథ మాటలే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేవలం రైల్వేజన్‌ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఈ అంశం ఉందన్న మంత్రి.. తాను కూడా ఇప్పటికీ ఆ అంశాన్ని పరిశీలిస్తున్నానంటూ చెప్తున్నారు.

కడప స్టీల్ ప్లాంట్.. రైల్వేజోన్ ఇలా ప్రతి విషయంలోనూ … చట్టంలో ఉన్న దాన్నే తాము చేస్తున్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. పైగా చట్టంలో ఉన్న హామీలను తాము పరిశీలిస్తూనే ఉన్నామంటూ నాంచివేత ధోరణిలో మాట్లాడుతున్నారు.

బయ్యారం, కడపలో స్టీల్‌ ప్లాంట్లపై చేతులెత్తేసిన కేంద్రం ఈ అమాశాలపై తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో.. దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై టాస్క్‌ఫోర్స్‌ నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ నివేదిక రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా సమాచారం ఇవ్వాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదంటూ తాము సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొనలేదని చెప్పుకొచ్చారు బీరేంద్రసింగ్‌. ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రం అవలంభిస్తున్న కక్షపూరిత చర్యలను అడ్డుకునే ప్రయత్నం బాగానే చేస్తోంది. ఏపీకి కేంద్రం ఎలా అన్యాయం చేస్తోందో ఆధారాలతో సహా ప్రజల్లో ఉంచి కేంద్రాన్ని దోషిని చేసే ప్రయత్నం చేస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.