కులాల లెక్కల్లో బీజేపీ ! ఏపీలో సరికొత్త వ్యూహానికి తెర !       2018-06-05   23:46:02  IST  Bhanu C

రాజకీయాల్లో కులాల పాత్ర చాలా కీలకం ! ఎక్కువ కులాల మద్దతు ఉన్నవారికే అధికారం దక్కడం ఇక్కడ సర్వ సాధారణం. అందుకే కులాల మద్దతు కోసం పార్టీలన్నీ తమ కుయుక్తులన్నీ పన్నుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే ఉదాహరణగా తీసుకుంటే.. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలింది ప్రధానంగా రెండే సామజిక వర్గాల వారే. ఒకటి కమ్మ వర్గం కాగా రెండోది రెడ్డి సామాజికవర్గం. అయితే సంఖ్యాపరంగా చూసుకుంటే ఈ రెండవర్గాలు మిగతా వర్గాలకంటే చాలా తక్కువ. ప్రస్తుతం కమ్మ సామాజిక వర్గం సుమారు 4.8 శాతం ఉంటే రెడ్లు 6.5 శాతం ఉన్నారు. బీసీలు 35.9 శాతం , ఎస్సీలు 17 శాతం ఉన్నారు. అంటే సంఖ్య పరంగా చూసుకుంటే బీసీలే ఎక్కువ.

ఈ లెక్కలన్నీ ఇప్పుడు బీజేపీ వేస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఎలాగూ కమ్మ సామాజిక వర్గం టీడీపీతో.. రెడ్డి సామాజికవర్గం వైసీపీతో ఉంటుందన్నది సాధారణ అంచనా. ఇక బీసీలు – ఎస్సీల విషయానికొస్తే ఈ రెండు పార్టీలూ వీరి ఓట్లను పంచుకుంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ బీసీలు -ఎస్సీలు… వారితో పాటు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా… రాజకీయంగా అధికారం అందుకోలేకపోతున్న కాపులను బీజేపీ దాని అనుకూల పార్టీల వైపు తిప్పుకొనేలా ప్రణాళికలు వేస్తోంది.

దీని ద్వారా తమ శత్రు పార్టీలను సులభంగా ఓడించవచ్చని బీజేపీ ఆలోచన. కాపు – బలిజ – ఒంటరి – తెలగ సామాజిక వర్గాలు కలిపి ఏపీలో 23.4 శాతం ఉన్నాయి. ఈ లెక్కన బీసీలు – కాపు – బలిజ – తెలగ – ఒంటరి సామాజికవర్గాలు కలిస్తే సుమారు 60 శాతం మంది ఉన్నట్లు. ఇప్పుడు బీజేపీ వీరినే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిని తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.