“కన్నా” ఎంపికపై “పవన్ ఎఫెక్ట్” ఉందా...బీజేపీ “నయా స్కెచ్” ఇదే       2018-05-14   02:42:56  IST  Bhanu C

రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఏపీలో శరవేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా కుల సమీకరణాలు మీద ప్రధాన పార్టీలు అన్ని దృష్టిసారించాయి. అందుకోసం తమ సిద్ధాంతాలను, నియమాలను కూడా పక్కనపెట్టి నాయకులకు పదవులు ఇస్తున్నాయి…కుల ప్రాతిపదికన బీజేపి ఏపీలో కొత్త నాటకానికి తెరలేపుతోంది.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపికే దీనికి ప్రధాన ఉదాహరణ.

కన్నా ఎంపికపై బీజేపీలో అసంతృప్తులు చెలరేగాయి. అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఆ పదవి ఆశించి భంగపడ్డారు. ఆయనకు పార్టీ ఎన్నికల నిర్వాహణ కమిటీ కన్వీనర్‌ పదవి ఇచ్చింది. వీటిని ఉదాహరణగా చూసుకుంటే ప్రధానంగా బీజేపీ కాపు సామజిక వర్గంపై దృష్టిసారించినట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది. ఏ పార్టీ ఎలా ఉన్నా.. బీజేపీ విషయానికి వస్తే పార్టీలో ఎక్కువ కాలం పనిచేసి, పార్టీ కోసం కష్టపడిన వారికే ఇటువంటి పదవులు దక్కేవి. కానీ దానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో పార్టీలో చేరిన కన్నాకు ఈ పదవి ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయమే బీజేపీ చేస్తున్నట్టు స్ప్రష్టంగా అర్ధం అవుతోంది.

అయితే గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లో కాపులంతా చేరిపోయారు. అయినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. మళ్ళీ చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో మళ్ళీ ఆ పార్టీ వైపు కాపు సామజిక వర్గం వారు ఆకర్షితులు అవుతున్నారు. దీన్ని నివారించి .. వారిని బీజేపీ వైపు మళ్లించేందుకే కన్నాకు , సోము వీర్రాజుకి ఈ పదవులు అప్పగించినట్టు రాజకీయంగా చర్చ జరుగుతోంది…ఈ క్రమంలోనే దీనికి బలం చేకూర్చుతూ కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఆయన్ను కలిసి ఏకాంతంగా చర్చించడం గమనించదగ్గ విషయం.

ఇదిలాఉంటే కన్నా నాయకత్వం పట్ల ముద్రగడ కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం…జనసేన వైపు చూస్తున్న కాపులు ఇప్పుడు బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉంది. యూత్‌ పవన్‌ కల్యాణ్‌ వైపే ఉన్నా.. కాపుల్లో ఇతరులు బీజేపీ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ నేతల ప్లాన్…అయితే ఈ ప్లాన్ సక్సెస్ కావాలంటే మాత్రం ముద్రగడ సహకారం తప్పని సరి..బీజేపీ కాపుల పార్టీ అనే భావనను గనుక ఏపీలో కలుగజేస్తే పవన్ హవాను అడ్డుకోవడం సులభం అవుతుంది. కానీ ఈ ప్రభావం టీడీపీ పై మాత్రం పెద్దగా పడదు. ఎందుకంటే… ఇంతకాలం ఏపీలో బీజేపీ నాయకత్వం కూడా టీడీపీకి సానుభూతి గానే పనిచేయడంతో టీడీపీ పై ఈ ప్రభావం పడే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఇప్పుడు చంద్రబాబును తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కన్నాను అధ్యక్షుడిని చేశారు కాబట్టి టీడీపీపై ఎదురుదాడి… బీజేపీ నుంచి తీవ్రస్థాయిలోనే ఉండవచ్చు.