ఏపీ బీజేపీలో ఆ ఇద్ద‌రికి ప‌ద‌వులు ఫిక్స్‌..!       2018-04-17   23:46:27  IST  Bhanu C

ఎన్డీయే స‌ర్కార్ నుంచి టీడీపీ భ‌య‌ట‌కు వ‌చ్చాక ఏపీలో పొలిటిక‌ల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగింది. టీడీపీ, బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయ్. ఈ రెండు పార్టీల మ‌ధ్య బ్రేక‌ప్‌తో మొత్తం నాలుగు మంత్రి ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి. కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు సుజ‌నాచౌద‌రి, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు రాజీనామాలు చేశారు. అలాగే స్టేట్ మంత్రి ప‌ద‌వుల‌కు కామినేని శ్రీనివాస్‌, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు కూడా రాజీనామా చేసేశారు. ఏపీలో ఇప్పుడు బీజేపీ పేరు చెపితేనే జ‌నాలు మండిప‌డుతున్నారు.

ఈ క్ర‌య‌మంలోనే ఇక్క‌డ బీజేపీ ప‌రిస్థితి చ‌క్క‌దిద్దేందుకు అధిష్టానం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్పుడు ఇక్క‌డ బీజేపీని గాడిలో పెట్టు నాయ‌కుడి కోసం అన్వేష‌ణ స్టార్ట్ చేసింది. ఏపీ బీజేపీ ప‌గ్గాల కోసం ఎంతో మంది సీనియ‌ర్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న కంభంపాటి హ‌రిబాబును మారుస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లు ఇలా ఉండ‌గానే ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న కంభంపాటి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేశారు.

దీంతో ఇప్పుడు ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఎంపిక‌వుతార‌న్న‌ది ? ఆస‌క్తిగా మారింది. ఇక క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన హ‌రిబాబును త‌ప్పించ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌కు ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేంద్ర మంత్రిగా హ‌రిబాబుకు క‌మ్మ కోటాలో ఛాన్స్ ఇస్తే ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌గ్గాలు కాపుల‌కు ఇస్తార‌ని తెలుస్తోంది. మరోవైపు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఇక్క‌డ చంద్ర‌బాబును, టీడీపీని ధీటుగా ఎదుర్కొని ఢీకొట్టే వారికే ఇవ్వాల‌ని బీజేపీ అధిష్టానం ప్లాన్‌. ముఖ్యంగా మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజులలో ఒకరికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది, గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున మంత్రిగా కూడా ప‌నిచేసిన క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ పేరును కూడా ప‌రిశీలిస్తున్నారు. అయితే క‌న్నా పార్టీ మారి రావ‌డంతో ఆర్ఎస్ఎస్‌, బీజేపీ జాతీయ అధిష్టానం సోము, పైడికొండ‌లలో ఎవ‌రో ఒక‌రు అయితే బాగుంటుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.