బిగ్‌బాస్‌ కొత్త నిర్ణయం వర్కౌట్‌ అయ్యేనా?  

హిందీ ప్రేక్షకులను దాదాపు దశాబ్ద కాలంగా అలరిస్తూ వస్తున్న బిగ్‌బాస్‌ తెలుగులో గత సంవత్సరం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. స్టార్‌ మాటీవీలో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు అనూహ్య స్పందన దక్కింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయడంతో కార్యక్రమం స్థాయి అమాంతం పెరిగింది...

-

రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ రావడంతో పాటు అద్బుతమైన లాభాలు స్టార్‌ మా వారికి దక్కాయి. అందుకే రెండవ సీజన్‌ను మరింత ఆకర్షనీయంగా, మరిన్ని ఎక్కువ రోజులతో తీసుకు వచ్చేందుకు స్టార్‌ మాటీవీ సిద్దం అయ్యింది. రెండవ సీజన్‌కు తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

గత కొంత కాలంగా రెండవ సీజన్‌కు ఎన్టీఆర్‌ అందుబాటులో ఉండక పోవచ్చు అనే టాక్‌ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ఎన్టీఆర్‌ స్థానంలో నానిని సంప్రదించారు అని, అందుకు ఆయన ఓకే అన్నాడు అంటూ సమాచారం అందుతుంది. ఆ విషయమై కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అంతా సైలెంట్‌గా వర్క్‌ జరిగిపోతుంది. తాజాగా దీక్షా పంథ్‌తో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సెబ్రెటీలతో పాటు సాదారణ వ్యక్తులు కూడా వెళ్లే అవకాశం ఉందని స్టార్‌ మా ప్రకటించింది..

ఇది సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సెలబ్రెటీలతో షో నిర్వహిస్తే జనాలు ఆసక్తిగా చూస్తారు. అయితే సెలబ్రెటీలతో పాటు సాదారణ జనాలు కూడా ఉంటే మరింత ఆసక్తి ఉంటుందనే అభిప్రాయం బిగ్‌బాస్‌ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.

సెలబ్రెటీల మద్య సాదారణ వ్యక్తులు ఎలా ఉంటారు, వారికి వీరికి పోటీ ఎలా ఉంటుంది, ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటారా, లేక ఢీ అంటే ఢీ అంటారా అనే విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. అందుకే సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు బిగ్‌బాస్‌ హౌస్‌ ఎంట్రీ ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

బిగ్‌బాస్‌ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల ఈసారి మరింత ఆసక్తికరంగా షో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఉంటేనే బాగుంటుందని మరి కొందరు అంటున్నారు. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఉండి, బిగ్‌బాస్‌ కొత్త నిర్ణయాన్ని అమలు చేస్తే గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌ డబుల్‌ సక్సెస్‌ గ్యారెంటీ అనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.