నాని బిగ్‌బాస్‌ లుక్‌.. చూడలేక పోతున్నాం       2018-05-19   06:54:48  IST  Raghu V

మనిషికి ఒక పనికి అలవాటు పడ్డాడు అంటే ఆ పని మానేయడానికి చాలా ఇబ్బంది పడాల్సిందే. ఇక ఏదైనా పాత్రలో ఒకరిని చూసిన తర్వాత మళ్లీ ఆ పాత్రలో మరోకరిని ఊహించుకోవడం ఇబ్బందే. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగు బిగ్‌బాస్‌ ప్రేక్షకులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ ప్రసారం అయిన విషయం తెల్సిందే. ఆ షో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ము దుమ్ముగా స్టార్‌ మాటీవీకి లాభాలు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్‌ రెండవ సీజన్‌ను చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

ఎన్టీఆర్‌ నో చెప్పడంతో ఆయన స్థానంలో యంగ్‌ హీరో నానిని స్టార్‌ మా వారు ఎంపిక చేశారు. దాదాపు రెండు మూడు నెలలుగా ఈ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. నాని వద్దకు ఈ విషయాన్ని తీసుకు వెళ్లిన సమయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా స్టార్‌ మా వారు ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన చేయడం జరిగింది. స్టార్‌ మాటీవీలో త్వరలో ప్రసారం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు హోస్ట్‌గా నాని వ్యవహరించబోతున్నాడని, అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. బిగ్‌బాస్‌ పోస్టర్‌లో ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా నానిని చూడాలి అంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు.

బిగ్‌బాస్‌ అనగానే తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్‌ను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. కాని తాజా పోస్టర్‌లో ఎన్టీఆర్‌కు బదులుగా నాని ఉండటంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు. పోస్టర్‌లోనే ఆకట్టుకోలేక పోయిన నాని షోను ఎలా రక్తి కట్టిస్తాడో అంటూ సినీ వర్గాల వారు మరియు విమర్శకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని స్టార్‌ మా వారు మాత్రం ఈ విషయమై తమకు ఎలాంటి అనుమానం లేదని, నాని తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా హోస్టింగ్‌ చేస్తాడు అంటున్నారు.

ఎన్టీఆర్‌ను చూసిన ప్రేక్షకులు నానిని చూడాంటే కాస్త మొదట ఇబ్బందిగా అనుకుంటారు. కాని మొదటి వారం పూర్తి అయిన తర్వాత నానికి అంతా అలవాటు పడిపోతారు. ఎన్టీఆర్‌ను మరిపించేలా నాని హోస్టింగ్‌ చేయడంతో పాటు, షోలో లీనమైపోయిన ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ జ్ఞప్తికి రాడు అంటూ స్టార్‌ మా వారు నమ్మకంగా చెబుతున్నారు. నానికి పలు స్క్రీన్‌ టెస్టులు చేయడంతో పాటు, నానితో కొన్ని టెస్టు షూట్‌లు చేసిన తర్వాత ఆయన్ను నిర్ణయించినట్లుగా చెప్పుకొచ్చారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించడంలో నానికి మంచి పేరుంది. అందుకే ఈ షోలో కూడా ఆయన తన సమయస్ఫూర్తిని వినియోగిస్తాడని స్టార్‌ మా వారు భావిస్తున్నారు. మరి స్టార్‌ మా వారి నమ్మకంను నాని నిలుపుకుంటాడా లేదా అనేది చూడాలి.