కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశం అమెరికాయే.లక్షలాది మరణాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో కేసులు వీటన్నింటికి మించి ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగింది.
దీనంతటికి కారణం చైనీయులు, ఆసియన్లే కారణమనే భావన అమెరికన్లలో బలంగా నాటుకుపోయింది.దీంతో ఆసియా అమెరికన్లను టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్నారు.
గడిచిన కొద్ది వారాల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి.భౌతికదాడులతో పాటు హత్యలకు సైతం ఉన్మాదులు వెనుకాడటం లేదు.
కొద్దిరోజుల క్రితం అట్లాంటాలోని మూడు మసాజ్ పార్లర్లను లక్ష్యంగా చేసుకుని ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మహిళలు మరణించారు.అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు సహా పలువురు ప్రముఖులు ఆసియన్లపై ద్వేషాన్ని విడనాడాలని పిలుపునిచ్చినా కొందరు మారడం లేదు.
తాజాగా న్యూయార్క్‌లో ఓ వృద్ధురాలిపై ఓ దుండగుడు తన ప్రతాపాన్ని చూపించాడు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటలకు నగరంలోని మాన్‌హాటన్ ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది.ఓ దుకాణం ముందు నుంచి 65 ఏళ్ల వయసున్న వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తోంది.
ఆ సమయంలో ఆమెకు ఎదురుగా వచ్చిన ఓ నల్లజాతి దుండగుడు తొలుత ఆమెను కాలితో తన్ని కిందపడేశాడు.ఈ పరిణామంతో కిందపడిపోయిన పెద్దావిడను అప్పటికీ వదలకుండా.పొత్తి కడుపుపై పదేపదే కాలితో తన్నాడు.దీంతో దెబ్బలు తాళలేక వృద్ధురాలు విలవిల్లాడిపోయింది.
అనంతరం ఆ దుండగుడు అక్కడి నుంచి తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాగా, వృద్ధురాలిపై దాడి చేసే సమయంలో దుండగుడు ఆసియాకు వ్యతిరేక నినాదాలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ ఘటనపై హేట్ క్రైమ్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది.
నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు వృద్ధురాలిపై దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఆయన ఖండించారు.ఈ తరహా దాడులను ఇకపై సహించేది లేదని బైడెన్ హెచ్చరించారు.
ఆసియా- అమెరికన్లపై జరుగుతున్న దాడులపై విచారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు బైడెన్ ట్వీట్ చేశారు.విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు.