మోదీ హయాంలో రేపు మొదటి సార్వత్రిక సమ్మె

భాజపా తిరుగులేని బండ మెజారిటీతో కేంద్రంలో అధికారం సంపాదించి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మొదటిసారిగా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం అంటే సెప్టెంబరు రెండో తేదీన సార్వత్రిక సమ్మె జరగబోతున్నది.యూపీఏ హయాంలోనూ సార్వత్రిక సమ్మెలు జరిగాయి.

 Bharat Bandh Tomorrow-TeluguStop.com

ఇలాంటి సమ్మెలకు ప్రధానంగా వామపక్షాలే నాయకత్వం వహిస్తుంటాయి.రేపటి సమ్మెకు కూడా ప్రధాన నాయకత్వం వామపక్షాలదే.

ఈ సమ్మెను ‘భారత్‌ బంద్‌’ అని కూడా వ్యవహరిస్తున్నారు.కార్మిక చట్టాల సవరణను, భూ సేకరణ చట్టానికి సవరణలను, రోడ్డు భద్రతా బిల్లును, విద్యుత్తు కాంట్రాక్టు యాక్టు…ఇంకా పలు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మె తలపెట్టాయి కేంద్ర కార్మిక సంఘాలు.

మోదీ ఇంత త్వరగా అంటే అధికారం చేపట్టిన పదిహేను నెలలకే కార్మిక వ్యతిరేకతను మూట్టగట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.కార్మికులకు, ఉద్యోగులకు ప్రభుత్వాలతో ఎప్పుడూ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.

ప్రధానంగా ప్రపంచీకరణ విధానాల అమలు ఎక్కువైన తరువాత, ప్రభుత్వ ఉద్యగాలు తగ్గిపోయిన తరువాత, ప్రతి రంగంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాలు ఎక్కువైన తరువాత ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి.ప్రతి రంగంలో ప్రయివేటీకరణ అధికం కావడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు వేగంగా ఉపసంహరించుకంటూ వనరులను బడా పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతుండటంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.

దాని ఫలితమే అప్పుడప్పుడూ దేశవ్యాప్త సమ్మెలు, బంద్‌లు జరుగుతున్నాయి.ఇక చిన్నా చితక సమ్మెలు అనేకం జరుగుతూనే ఉన్నాయి.

రేపటి సార్వత్రిక సమ్మెలో విద్యార్థులు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు.రోడ్డు భద్రత బిల్లును రవాణా రంగం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండటంతో ప్రయివేటు వాహనాలు సహా ప్రభుత్వ వాహనాలు (ఆర్‌టిసీ మొదలైనవి) రోడ్డుపై తిరిగే అవకాశం లేదు.

ఆటోవాలాలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు.బ్యాకింగ్‌ రంగం ఉద్యోగులు, లైఫ్‌ ఇన్సూరెన్సు సహా ప్రభుత్వ బీమా కంపెనీల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రయవేటు విద్యా సంస్థలు కూడా మూతబడే అవకాశం ఉంది.అన్ని రకాల మార్కెట్లు మాతబడబోతున్నాయి.

అత్యవసర సర్వీసులైన వైద్యం, మరి కొన్ని సేవలను సమ్మె నుంచి మినహాయించారు.ప్రధాన నగరాల్లోని ఐటీ కంపెనీలు, పెద్ద కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ‘మీరు సమ్మెలో పాల్గొనవద్దు.

విధులకు హాజరు కావల్సిందే’ అని ముందే ఆర్డరు వేశాయి.కార్మిక సంఘాలు, కమ్యూనిస్టులు అంటే పడని ప్రభుత్వాలు సర్కారు ఉద్యోగులకు సమ్మెలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశాయి.

ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది.సార్వత్రిక సమ్మెలో భాజపా అనుబంధ కార్మిక సంఘమైన బీఎంఎస్‌ పాల్గొనడంలేదని సమాచారం.

యూపీఏ హయాంలో జరిగిన సమ్మెల్లో ఇది పాలుపంచుకుంది.ఈ సమ్మె విజయవంతమైతే మోదీ సర్కారుకు ప్రమాద ఘంటికలు మోగినట్లే.

ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు ఏమీలేదుగాని క్రమంగా బీటలువారే అవకాశం ఉంది.వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube