తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏది జరిగినా దానికి హుజూరాబాద్ ఉప ఎన్నికకు లింక్ కచ్చితంగా ఉంటుంది.ఇదే క్రమంలో ఇప్పుడు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు క్షమించండి తప్పుచేశాను అని లేఖ రాసినట్టు ఓ లెటర్ హల్‌చల్ చేస్తోంది.
అయితే ఈ లేఖపై బీజేపీ గట్టి కౌంటర్ వేస్తోంది.బండి సంజయ్ స్పందిస్తూ ఈ లెటర్ రాసిన బాల్కసుమన్‌ది దిగజారుడు తనమంటూ మండిపడ్డారు.
అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా బాల్క సుమన్ గట్టి సవాలే చేశారు.
ఒకవేళ ఆ లేఖ ఫేక్ అయితే బండి సంజయ్ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయాలని సంచలన సవాల్ చేశారు.
అంతే కాదు తన సవాల్‌ను సంజయ్ స్వీకరించాలని లేదంటే అది నిజమని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.ఇక్కడే బాల్కసుమన్ ఓ విషయాన్ని మర్చిపోయారా అనే చర్చ జరుగుతోంది.
ఏంటంటే జీహెచ్ ఎంసీ ఎన్నికలప్పుడు పదివేల సాయాన్ని ఆపాలంటూ బండి సంజయ్ ఈసీకి లేఖ రాశారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
అయితే ఆ లేఖ తనపేరుపై కావాలనే టీఆర్ ఎస్ నేతలు రాశారని నిజమైతే భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలని అప్పట్లో బండి సంజయ్ సవాల్ విసిరారు.అంతే కాదు ఆయన టెంపుల్ వద్దకు వెళ్లి మరీ కేసీఆర్ కు దమ్ముంటే రావాలని డిమాండ్ చేశారు.అయితే దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ప్రమాణం చేయాలంటే సిటీలో చాలా దేవాలయాలు ఉన్నాయని, కానీ కావాలనే మత రాజకీయాల కోసం హిందూ, ముస్లింలను రెచ్చగొట్టాలని చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు వెళ్లారని విమర్శించారు.
అయితే ఇప్పుడు మళ్లీ బాల్కసుమన్ ఆ టెంపుల్‌లోనే ప్రమాణం చేయాలనడం వెనక రాజకీయమేంటో అర్థం కావట్లేదు.మరి ఆయన కేటీఆర్ మాటల్ని మరిచే ఆ సవాల్ చేశారా లేక ఇంకేదైనా రాజకీయం ఉందా అనేది వేచి చూడాలి.