బండ్ల గణేష్‌ తీరు అర్థం కావడం లేదే!       2018-07-01   00:02:20  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులకు బండ్ల గణేష్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నటుడిగా పరిచయం అయిన బండ్ల గణేష్‌, ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించాడు. ఈయన నిర్మించిన ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో గత కొంత కాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. వ్యాపారం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బండ్ల గణేష్‌ గత కొంత కాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో బండ్ల గణేష్‌ ఉన్నాడు అంటూ రాజకీయ వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

-

బండ్ల గణేష్‌కు అత్యంత ఆప్తుడు పవన్‌ కళ్యాణ్‌. తన అభిమాన హీరో పవన్‌ కళ్యాణ్‌ అంటూ, పవన్‌ను పల్లెత్తు మాట అన్నా కూడా ఊరుకోను అంటూ బండ్ల గణేష్‌ చెబుతూ వస్తుంటాడు. ఎవరైనా పవన్‌ గురించి మాట్లాడితే వెంటనే ట్విట్టర్‌ ద్వారా వారిపై కౌంటర్‌ వేయడం, వారిపై విమర్శలు చేయడం బండ్ల గణేష్‌ చేస్తూ ఉంటాడు. ఆ కారణంగానే పవన్‌ జనసేనలో బండ్ల గణేష్‌ క్రియాశీలకంగా ఉంటాడు అంటూ అంతా భావిస్తున్నారు. అయితే బండ్ల గణేష్‌ మాత్రం ఒకసారి కాంగ్రెస్‌ వైపు మరోసారి టీడీపీ వైపు ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈయన జనసేనపై ఆసక్తి ఉన్నట్లుగా ప్రవర్తించడం లేదు. పవన్‌ అంటే అభిమానం కాని జనసేన అంటే ఆసక్తి లేదు అంటూ గతంలో చెప్పుకొచ్చాడు.

ఇటీవల రాహుల్‌ గాంధీ పుట్టిన రోజు సందర్బంగా హస్తినలో రాహుల్‌ను స్వయంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు, దేశ బావి ప్రధాని అంటూ రాహుల్‌ గాంధీని ప్రశంసించడం జరిగింది. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందనే అభిప్రాయంలో బండ్ల గణేష్‌ ఉన్నాడు అంటూ ఆయన మాటల్లో తెలుస్తుంది. మోడీని వ్యతిరేకిస్తూ, రాహుల్‌ను ప్రధాని కావాలని కోరుకుంటూనే ఈయన టీడీపీకి కూడా దగ్గరగా ఉంటూ వస్తున్నాడు.

తాజాగా కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. కేంద్రం దిగి వచ్చే వరకు దీక్ష చేస్తానంటూ రమేష్‌ దృడ నిశ్చయంతో దీక్ష చేస్తున్నాడు. అయితే కేంద్రం దిగి రాకపోవడంతో తాజాగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. పదవ రోజున సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించాడు. దీక్ష చేసిన సీఎం రమేష్‌ను బండ్ల గణేష్‌ పరామర్శించాడు. తనకు ఆప్తుడు అయిన సీఎం రమేష్‌తో చాలా సమయం బండ్ల గణేష్‌ మాట్లాడటం జరిగింది. అదే సమయంలో టీడీపీ నాయకులతో కూడా ఆయన చర్చలు జరిపాడు.

మొత్తానికి బండ్ల గణేష్‌ రాజకీయాల గురించి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతుంది. బండ్ల గణేష్‌ ఏ పార్టీకి మద్దతుగా 2019లో ఉంటాడు, ఒక వేళ పోటీ చేస్తే ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.