బాలయ్య.. ఈ తొందర ఎందుకయ్యా       2018-07-02   05:04:02  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ కెరీర్‌ ఆరంభం నుండి కూడా సంవత్సరంకు రెండు మూడు సినిమాలకు తగ్గకుండా చేస్తూ వస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా స్టార్‌ హీరోలు సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గించారు. సంవత్సరంలో ఒకటి మాత్రమే చేస్తున్నారు. కొందరు హీరోలు మాత్రమే రెండు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు కూడా రెండు సంవత్సరాలకు మూడు చిత్రాల కంటే ఎక్కువ విడుదల చేయలేక పోతున్నారు. ప్రస్తుతం ఒకానొక సమయంలో ఒకే చిత్రాన్ని చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఒకేసారి మూడు నాలుగు చిత్రాలను దర్శకుడు కాని, హీరో కాని కమిట్‌ అవ్వడం లేదు. కాని బాలయ్య మాత్రం మునుపటి ఫార్ములానే ఫాలో అవుతున్నాడు.

బాలకృష్ణ ఒకవైపు చిత్రాన్ని చేస్తూనే మరో వైపు తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సినిమాలు వేగంగా చేయాలని భావించే బాలకృష్ణ తన తొందరపాటు నిర్ణయంతో సినిమాలను ఫ్లాప్‌ చేసుకుంటున్నాడు. సినిమాల సంఖ్య పెంచుకోవాలని తప్ప, మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం బాలయ్యకు లేదా ఏంటీ అంటూ కొందరు ఫ్యాన్స్‌ అంటున్నారు. బాలకృష్ణ గత కొంత కాలంగా అడపా దడపా తప్ప పెద్దగా సక్సెస్‌లు అందుకున్న దాఖలాలు లేవు. అయినా కూడా ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలు కమిట్‌ అవుతూ వస్తున్నాడు.

బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఇదో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌. ఇలాంటి ప్రాజెక్ట్స్‌ చేసే సమయంలో బాలయ్య ఇతర చిత్రాల గురించి, ఇతర కథల గురించి ఆలోచించకుండా ఉంటే బెటర్‌. కాని బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ చిత్రం తర్వాత చేయబోతున్న రెండు సినిమాలను అప్పుడే లైన్‌లో పెట్టాడు. అందులో మొదటగా వినాయక్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతుండగా, సి కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కథ తయారి గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది.

వినాయక్‌ తర్వాత బాలకృష్ణ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో చిత్రం చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. బాలయ్య, బోయపాటిల కాంబో మూవీని మైత్రి మూవీస్‌ వారు నిర్మించేందుకు అప్పుడే రెడీ అయిపోతున్నారు. అటు దర్శకుడికి, ఇటు హీరోకు కూడా అడ్వాన్స్‌లు ఇచ్చేసి అంతా సిద్దం చేశారు. వచ్చే సంవత్సరం ఆరంభంలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. బాలయ్య ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.