తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎన్నో సంక్షోభాలు చోటు చేసుకుంటున్నా, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడేలా పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా ఒక్కొక్కరుగా వైసీపీ కండువా కప్పుకుంటున్నారు.ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా, ఒకవైపు వైసిపి ఏకగ్రీవాలపై దృష్టి పెట్టి విజయదరహాసం ప్రదర్శిస్తోంది.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులను వైసీపీలో చేర్చుకుంటూ వైసీపీ హడావుడి చేస్తోంది.ఈ పరిస్థితుల్లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
ఈ సమయంలో పార్టీకి అండగా ఉంటూ ధైర్యం చెప్పాల్సిన నందమూరి బాలకృష్ణ తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.అంతేకాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఆ నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
సినిమాలు తప్ప రాజకీయాల గురించి, పార్టీ గురించి పట్టించుకోనట్టు ఆయన వ్యవహరిస్తుండడంపై ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చకు కారణం అవుతోంది.అంతేకాకుండా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ బాలయ్య నోరు మెదపలేదు.
అలాగే తనకు, పార్టీకి అత్యంత సన్నిహితులైన ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ కండువా కప్పుకున్నా బాలయ్య నోరు మెదపలేదు.టిడిపి సీనియర్ నాయకుడు కరణం బలరాం వైసీపీలోకి వెళ్లినా బాలయ్య స్పందించలేదు.
దీంతో అసలు బాలయ్యకు ఏమైంది అనే చర్చ పార్టీలోనూ, ప్రజల్లోనూ నెలకొంది.దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
గత టిడిపి ప్రభుత్వంలో బాలయ్య మంత్రి పదవి ఆశించడం, చంద్రబాబు ఆ విషయాన్ని పక్కన పెట్టారు.
ఇక తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా తనకు అవకాశం ఇస్తారని, పార్టీలో తన సత్తా చాటవచ్చని బాలయ్య ప్లాన్ చేసినా బాలయ్యను పట్టించుకోనట్టుగా చంద్రబాబు దూరం పెడుతుండటం, పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో నాకెందుకు వచ్చింది లే అన్నట్టుగా బాలయ్య వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా బాలయ్య మాత్రం ఇవేవీ పట్టనట్టు గా వ్యవహరిస్తున్నాడు.కనీసం సొంత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను గురించి కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.