రేవంత్‌కు బాల‌య్య పంచ్ ప‌డిందిగా..   Balakrishna Punch To Revanth Reddy     2017-01-06   05:11:13  IST  Bhanu C

సినిమాల్లో త‌న పంచ్ డైలాగుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌తిపోయేలా చేసే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన శైలిలో ఆయ‌న దూసుకుపోతున్నారు. ఇలా త‌న‌దైన దూకుడుతో ఉన్న బాల‌య్య‌.. పార్టీలోని ఫైర్‌బ్రాండ్ నేత‌కే పంచ్ ఇచ్చాడు. తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ ఎవ‌రంటే వినిపించే పేరు రేవంత్ రెడ్డి! ఇప్పుడు బాల‌య్య.. రేవంత్ రెడ్డికే దిమ్మ‌తిరిగే పంచ్ ఇచ్చాడు.

బాల‌కృష్ణ 100వ సినిమా గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతుంద‌న్న విష‌యం తెలిసిందే! ఇప్ప‌టికే ఈ సినిమాకు ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌భుత్వాలు వినోద ప‌న్నును కూడా మిన‌హాయించాయి. అయితే ఈ సినిమా చూడాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగానే తెలియ‌జేశారు. దీంతో ఈ సినిమా స్పెష‌ల్ షోకు కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు బాల‌కృష్ణ‌.. తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. ఈ విష‌యం తెలుసుకున్న తెలుగుదేశం నేత‌లతో పాటు రేవంత్.. బాల‌య్య కారుకు ఎదురెళ్లి సాద‌రంగా ఆహ్వానించారు.

కారు దిగిన వెంట‌నే బాల‌య్య‌కు రేవంత్ ప‌సుపు రంగు పూల బొకేను అందించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘వెల్ కం టూ తెలంగాణ అసెంబ్లీ’ అని అన్నారు. దీనికి స్పందించిన బాలకృష్ణ.. తాను కళాకారుడినని.. తనకు రాష్ట్రాలతో సంబంధం లేదని.. వేరు చేసి మాట్లాడటం సరికాదంటూ తనదైన ధోరణిలో చెప్పుకొచ్చారు. దీంతో బాల‌య్య నుంచి ఊహించని రీతిలో పంచ్ పడేసరికి రేవంత్ ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌.

అయితే ఇదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ నేతలు బాలకృష్ణకు పింక్ కలర్ గులాబీల బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బాలకృష్ణకు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఆసక్తిని ప్రదర్శించటం గమనార్హం.