బాలయ్య కాస్త ఓపిక పట్టులేవా?       2018-05-11   01:49:29  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక విషయంలో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటాడు. ఆలోచించకుండా, హడావుడిగా సినిమాలను ఎంపిక చేస్తాడని, దర్శకుల గురించి, సినిమా కథ గురించి ఆయన పెద్దగా ఆలోచించడు అంటూ విమర్శలు ఉన్నాయి. నందమూరి అభిమానులు కూడా ఇదే విషయమై పలు సందర్బాల్లో బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా బాలయ్య తన నిర్ణయ విధానంను మార్చుకోవడం లేదు. ఇటీవల తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించాలని భావించాడు. కాని అది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంటనే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌ సినిమా దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో ఖాళీగా ఉండటం ఎందుకని వినాయక్‌ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వినాయక్‌ కథ కూడా సిద్దం చేసుకోకుండానే బాలయ్య ఓకే చెప్పాడు. దాంతో ఇప్పుడు హడావుడిగా బాలయ్య కోసం వినాయక్‌ కథ సిద్దం చేస్తున్నాడు. వచ్చే నెలలో వినాయక్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ బ్యానర్‌లో బాలయ్య సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలనే షరతు దర్శకుడికి బాలయ్య పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఒక స్టార్‌ హీరో సినిమా ఈమద్య మూడు నెలల కాలంలో పూర్తి చేయడం అనేది అవివేకమైన నిర్ణయం. సినిమాల ఎంపికలో జాగ్రత్త చూపని బాలకృష్ణ కనీసం సినిమాకు కాస్త ఎక్కువ సమయం కేటాయించి, దర్శకుడు అనుకున్నట్లుగా సినిమా తీసేలా ఛాన్స్‌ ఇవ్వడం లేదు. మూడు నెలల తర్వాత ‘ఎన్టీఆర్‌’ సినిమాను చేయాలి కనుక వినాయక్‌కు మూడు నెలల మాత్రమే సమయం ఇచ్చినట్లుగా సినీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది. ఇంత హడావుడిగా సినిమా చేయాలని అవసరం ఏంటి బాలయ్య అంటూ ఫ్యాన్స్‌ నెత్తి నోరు కొట్టుకుంటూ చెబుతున్నారు. కాని బాలయ్య మాత్రం సీతయ్య తమ్ముడు కదా, అందుకే ఎవరి మాటా వినడం లేదు.

బాలకృష్ణ, వినాయక్‌ల కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఈసారి హ్యాట్రిక్‌ కొడతారేమో చూడాలి. అయితే హ్యాట్రిక్‌కు ఛాన్స్‌ ఉన్నా కూడా బాలయ్య హడావుడి చేయడం వల్ల సినిమాను వినాయక్‌ తుతు మంత్రంగా పూర్తి చేసే అవకాశం ఉంది. దాంతో హ్యాట్రిక్‌ దక్కక పోవచ్చు. మరోవైపు నిర్మాణంలో విలువలు పాటించని సి కళ్యాణ్‌ బ్యానర్‌కు బాలయ్య డేట్లు ఇచ్చాడు. ఈ విషయంలో కూడా ఫ్యాన్స్‌ నుండి ఈయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఎన్టీఆర్‌ సినిమా అనుకున్నప్పుడు కాస్త ఆలస్యం అయినా ఆ సినిమానే మొదట చేస్తే బాగుండేది అంటూ సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.