బాలయ్య గట్టిగా కోరుకుంటే ఇలాగే ఉంటుంది       2018-06-02   23:21:17  IST  Raghu V

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయాలనుకున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. తన తండ్రి జీవిత చరిత్రను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే గట్టి పట్టుదలతో ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ చేతిలో పెట్టాడు. ఆయన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న సమయంలోనే ఏదో వివాదం తలెత్తి తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత సినిమా బాధ్యతను క్రిష్‌కు అప్పటించాడు. తన గత చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి క్రిష్‌ మంచి న్యాయం చేశాడు. అందుకే ఎన్టీఆర్‌ సినిమాకు కూడా ఆయనకే ఛాన్స్‌ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

గతంలో బాలకృష్ణ తీయాలనుకున్న పలు ప్రతిష్టాత్మక చిత్రాలు ఆదిలోనే ఆగిపోయాయి. ముఖ్యంగా బాలయ్య ఎంతో ఇష్టపడి తలపెట్టిన ‘నర్తనశాల’ చిత్రం కొన్ని రోజుల షూటింగ్‌ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా ఊసే ఎత్తలేదు. ఎప్పటికైనా ఆ సినిమాను తీస్తాను అంటాడు కాని, బాలయ్య మళ్లీ ఆ సినిమాను చేసేంత సాహసం చేయడు అంటున్నారు. ఆ సినిమా మొదలు పెట్టినప్పుడు వరుసగా ఏదో ఒక అపశకునం ఎదురైంది. దాంతో సినిమాను పక్కకు పెట్టాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. వరుసగా ఎన్టీఆర్‌ సినిమా అనుకున్నప్పటి నుండి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. తాజాగా దర్శకుడు క్రిష్‌ చిక్కుల్లో పడ్డాడు.

బాలకృష్ణ పూర్తి నమ్మకంతో ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ను క్రిష్‌కు అప్పగించాడు. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు నువ్వే సినిమాను తీయాలని పట్టుబట్టడంతో పాటు, పారితోషికం కాస్త భారీ మొత్తంలో ఇచ్చేందుకు బాలయ్య ముందుకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని టేకోవర్‌ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మణికర్ణిక చిత్రాన్ని చేస్తున్న బాలయ్య ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ సినిమాను నెత్తిన పెట్టుకోబోతున్నాడు. ఈ సమయంలోనే ఈయన వ్యక్తిగత సమస్యలు తల నొప్పి తెచ్చి పెడుతున్నాయి.

గత కొన్ని నెలలుగా క్రిష్‌ సంసార జీవితం సాఫీగా సాగడం లేదు. ఆయన భార్య రమ్యతో సరైన జీవితంను గడపడం లేదు. ఇద్దరు కూడా వేరు వేరు వృత్తుల వారు అవ్వడంతో ఇద్దరి మద్య చాలా గ్యాప్‌ వస్తుంది. దాంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో క్రిష్‌కు ‘ఎన్టీఆర్‌’ సినిమా బాధ్యత అప్పగిస్తే ఎలా చేస్తాడో ఏంటో అనే అనుమానాలు నందమూరి ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ టెన్షన్‌తో క్రిష్‌ ఈ సినిమాను సరిగా చేయలేక పోతే మొదటికే మోసం వస్తుంది. అంటే బాలయ్య ఏ సినిమా అయితే గట్టిగా చేయాలని కోరుకుంటాడో ఆ సినిమాకు ఇలాంటి గతే పడుతుంది.