దూకుడు పెంచిన బాలయ్య...హిందూపురంపై పట్టు సాధిస్తున్నాడు       2018-07-04   06:06:44  IST  Bhanu C

సినిమాలు ఒకవైపు రాజకీయాలు ఒకవైపు ఇలా రెండుపడవల మీద వెళ్తున్న హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ రాజకీయంగా కొంత వెనుకబడ్డాడు. ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు చెలరేగిపోయాయి.అయితే పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన బాలయ్య నష్ట నివారణకు దిగాడు. హిందూపురం నియోజకవర్గాలంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అందుకే పల్లెల్లో ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు తెలుసుకోవడానికి ఏకంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. సినిమాలు, ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు వింటున్నారు.

ఈ చర్యలతో బాలయ్యపై ప్రజల్లో మరింత అభిమానం పెరిగింది. చాగలేరు గ్రామంలో దళితవాడలో సామూహిక సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. స్వయంగా ఒక మహిళకు భోజనం తినిపించారు. సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మొదటి రోజు బిజీగా గడిపారు. అదే రోజు దిగువల్లి తాండాలో ఒక ఇంట్లో పల్లెనిద్ర చేశారు. తెల్లవారు జామున త్రెడ్ మిల్‌పై వ్యాయమం చేశారు. ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. రెండవ రోజు ఇదే మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. వీరాపురంలో పల్లెనిద్ర చేశారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో చిలమత్తూరు మండలంలో బాలయ్యబాబుకి తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు మరింత దగ్గర కావాలని బాలకృష్ణ ప్రయత్నిస్తున్నాడు.

స్థానిక నేతలకు బాలయ్య మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన పర్యటనలో జిల్లా నేతలు కానీ.. స్థానిక నియోజకవర్గ నేతలు కానీ తన వెంట లేకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. ఆయా గ్రామ నేతలను వెంటబెట్టుకుని వారినే వేదికల మీదకు ఎక్కించి మాట్లాడించారు. దీంతో స్థానిక నేతలకు బాలయ్య మరింత చేరువయ్యారనే అభిప్రాయం ఏర్పడింది. బాలయ్యకి కొంచెం కోపమెక్కువ అన్న భావన ప్రజల్లో ఉంది. అయితే ఈసారి ఆయన ఎంతో ఓపికని ప్రదర్శించారు. ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. ప్రజలకి బాలయ్యబాబు అందుబాటులో ఉండటం లేదనే అపవాదు నుంచి బయటపడటానికి బాలయ్య తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు.