ప్లీజ్‌.. అంజలి వద్దు!  

తెలుగమ్మాయి అంజలి తమిళంలో హీరోయిన్‌గా మొదట గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత తమిళ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ సక్సెస్‌ అవ్వడంతో తెలుగులో కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా ఈమెకు స్టార్‌ ఇమేజ్‌ను తీసుకు రాలేక పోయాయి. ఇటీవలే ‘గీతాంజలి’ సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా నటించబోతున్న ‘డిక్టేటర్‌’లో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

‘లౌక్యం’ ఫేం శ్రీవాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘డిక్టేటర్‌’ త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనుండగా, హీరోయిన్‌గా అంజలి వద్దు అంటూ నందమూరి ఫ్యాన్స్‌ బాలయ్యను కోరుతున్నారు. బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్‌గా సూట్‌ అవ్వదనే ఉద్దేశ్యాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేరుగా బాలకృష్ణ వద్ద ఈ విషయాన్ని ప్రస్థావించినట్లుగా తెలుస్తోంది. అయితే బాలయ్య అందుకు మౌనం వహించాడు. ఇక దర్శకుడితో కూడా పలువురు హీరోయిన్‌ మార్పుపై చర్చించారు. మరి దర్శకుడు శ్రీవాస్‌ ‘డిక్టేటర్‌’ హీరోయిన్‌ను మార్చుతాడా లేదో చూడాలి. బాలయ్య నటించిన తాజా చిత్రం ‘లయన్‌’ ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘లయన్‌’ విడుదల కాగానే ‘డిక్టేటర్‌’ ప్రారంభం కానుంది.