మా పోకిరి, ఇడియట్‌ ఎక్కడ పూరి?     2018-05-11   23:28:25  IST  Raghu V

తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. ఆ గొప్ప దర్శకుల జాబితాలో పూరి జగన్నాధ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన భద్రి, పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్‌, దేశ ముదురు ఇలా పు చిత్రాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్నాయి. ఇక అతి తక్కువ సమయంలో ఈతరం దర్శకుల్లో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత కూడా పూరికే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూరి స్పీడ్‌పై ఒకానొక సమయంలో రాజమౌళి స్పందిస్తూ.. పూరి జగన్నాధ్‌ సినిమాల స్పీడ్‌ చూస్తే అసూయగా అనిపిస్తుంది. ఆయన అంత స్పీడ్‌గా తాను ఎందుకు సినిమాలు చేయాలేనా అని బాధపడుతూ ఉంటాను అంటూ కామెంట్‌ చేశాడు అంటూ పూరి స్థాయి ఏంటో చెప్పనక్కర్లేదు.

పూరి జగన్నాధ్‌ కింది స్థాయి నుండి వచ్చిన దర్శకుడు. చిన్న చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించి స్టార్స్‌, సూపర్‌ స్టార్స్‌తో సినిమాలు తీసిన ఘనత ఆయనది. బాలీవుడ్‌లో సైతం ఈయన సినిమా తీశాడు. అమితాబచ్చన్‌తో సినిమా తీసే అవకాశం దక్కించుకున్న అతి కొద్ది సౌత్‌ దర్శకుల్లో ఈయన ఒక్కరు. అలాంటి పూరి ప్రస్తుతం తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అవుతున్నాయి. అయినా కూడా ఈయనపై ప్రేక్షకులు నమ్మకం పెట్టుకుని చేసిన ప్రతి సినిమాను చూస్తేనే ఉన్నారు. కాని ప్రతి సినిమా కూడా ఒకే ఫలితాన్ని ఇస్తుంది.

తాజాగా పూరి తన కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తాను ఒక అనుభవం ఉన్న దర్శకుడిగా కాకుండా కొత్త దర్శకుడిగా తీశాను అని, తప్పకుండా ఇది తన అభిమానులకు మరియు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగుల్చుతుందని చెప్పుకొచ్చాడు. కాని మెహబూబా కూడా సేమ్‌ టు సేమ్‌ ఆయన గత చిత్రాల ఫలితానే చవి చూశాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథనం, తన మార్క్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పూరి జగన్నాధ్‌ మెహబూబా చిత్రం చూసిన తర్వాత ఆయన అభిమానులు గతంలో పోకిరి, ఇడియట్‌ వంటి సినిమాలు చేసిన దర్శకుడే ఈ సినిమాను కూడా తీశాడు అంటే నమ్మలేకుండా ఉన్నాం. ఆయన స్థాయి ఇదేనా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు పూరి అంటే ఒక బ్రాండ్‌ క్రియేట్‌ అయ్యింది. కాని ఆ బ్రాండ్‌కు తగ్గట్లుగా ప్రస్తుతం సినిమాలు రావడం లేదని స్వయంగా ఆయన అభిమానులు అంటున్నారు. పూరి మార్క్‌ పూర్తిగా మిస్‌ అయ్యిందని, పూరి తన గత సినిమాలను తానే చూసుకోవడం బెటర్‌ అని, ఆయన తదుపరి సినిమాలో అయినా ఆయన సినిమా మార్క్‌లో తీయాలని కోరుకుంటున్నాం అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు పోస్ట్‌ చేస్తున్నారు. మెహబూబా ఫ్లాప్‌ అయినా కూడా తమకు పూరి అంటే ఇష్టమే అంటూ ఎక్కువ శాతం ఫ్యాన్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.