3. బాబు గోగినేని బయటకు రాక తప్పదా.. ముమైత్‌ పరిస్థితే బాబుకు     2018-07-20   10:59:05  IST  Ramesh Palla

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ సమయంలో డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారిన విషయం తెల్సిందే. డ్రగ్స్‌ కేసులో ముమైత్‌ ఖాన్‌ పేరు బయటకు రావడం జరిగింది. అదే సమయంలో ముమైత్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ ఇంట్లో ఉంది. బిగ్‌బాస్‌ నిర్వాహకులకు డ్రగ్స్‌ కేసు ఎంక్వౌరీ చేస్తున్న అధికారులు నోటీసులు ఇవ్వడంతో షో నిర్వాహకులు స్వయంగా ముమైత్‌ను తీసుకు వెళ్లి, విచారణ అధికారులు ముందు ఆమెను హాజరు పర్చి మళ్లీ బిగ్‌బాస్‌ ఇంటికి తీసుకు వెళ్లారు. ఇప్పుడు అదే పరిస్థితి బాబు గోగినేనికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో బాబు గోగినేని ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. అంతా కూడా బిగ్గర్‌ బాస్‌ అంటూ పిలుచుకుంటున్న బాబు గోగినేనిపై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది.

గతంలో బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు మరియు చేపట్టిన కార్యక్రమాలపై గత కొంత కాలంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దేశద్రోహం కేసును నమోదు చేయడం జరిగింది. పలువురి ఆధార్‌ వివరాలను బాబు గోగినేని బయటకు ఇవ్వడంతో పాటు, ఆధార్‌ సమాచారాన్ని వృదా చేశారు అంటూ కూడా బాబు గోగినేనిపై కేసులు నమోదు అయ్యాయి. దాంతో పోలీసులు ఆయన్ను విచారించేందుకు సిద్దం అవుతున్నారు. తాజాగా బాబు గోగినేనిని విచారించాల్సిందే అంటూ బిగ్‌బాస్‌కు పోలీసు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. బాబు గోగినేనిని తమకు అప్పగించాలని, లేదంటే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న బాబు గోగినేని వద్దకు నేరుగా వెళ్లి అరెస్ట్‌ చేయాల్సి ఉంటుంది అంటూ నోటీసులో పేర్కొన్నారు.

Babu Gogineni To Come Out Of Bigg Boss House-

Babu Gogineni To Come Out Of Bigg Boss House

బాబు గోగినేనిని అప్పగించాలని బిగ్‌బాస్‌ టీం నిర్ణయించింది. అయితే ఒక్కరోజు విచారణ చేపట్టి మళ్లీ తమకు బాబును అప్పగించాలనే అప్పీల్‌ బిగ్‌బాస్‌ నిర్వాహకుల నుండి వ్యక్తం అవుతుంది. పోలీసులు దానిపై ఎలా రియాక్ట్‌ అవుతారో చూసి, ఆ తర్వాత బాబు గోగినేనిని ఎలా బయటకు పంపించాలి అనే విషయమై ఆలోచించనున్నారు. బాబు గోగినేని ఒక వేళ విచారణకు హాజరు అయితే ముమైత్‌ లాగా సింపుల్‌గా మళ్లీ లోనకు వెళ్లే అవకాశం ఉండదు. పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని, జడ్జ్‌ ముందు నిలబెట్టే అవకాశం ఉంది. అందుకే ఒకసారి బిగ్‌బాస్‌ నుండి బిగ్గర్‌బాస్‌ బాబు బయటకు వస్తే మళ్లీ లోనకు వెళ్లడం కష్టమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి బిగ్‌బాస్‌లో ఏదో ఆశ్చర్యకర విషయం జరుగబోతుంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఒకవేళ బిగ్‌బాస్‌ నుండి బాబు గోగినేని బయటకు వెళ్తే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే అవకాశం ఉందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు హైలెవల్‌ వ్యక్తులతో మాట్లాడిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే ఈవిషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.