క్రికెట్ ఆటలో ఫార్మేట్ ఏదైనా సరే తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ, సిక్స్ లు కొడుతూ క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ “డేవిడ్ వార్నర్” గురించి ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే బీసీసీఐ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ తరఫున పాల్గొంటున్నాడు.
ఈ క్రమంలో తెలుగు భాషపై మక్కువ పెరగడంతో అప్పుడప్పుడు తెలుగు పాటలకి టిక్ టాక్ వీడియోలు కూడా చేసేవాడు.ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో చిత్రంలోని బుట్ట బొమ్మ పాటకి డాన్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.
అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే డేవిడ్ వార్నర్ ఇటీవలే తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇందులో ఓ నెటిజన్ మీరు తెలుగులో నటుడిగా ఎంట్రీ ఇవ్వచ్చు కదా.! అని అడిగాడు. దీంతో డేవిడ్ వార్నర్ తనని “నటించమని ఎవరైనా దర్శకనిర్మాతలు కోరితే కచ్చితంగా నటిస్తానని” తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
దీంతో కొందరు నెటిజన్లు డేవిడ్ వార్నర్ తొందర్లోనే టాలీవుడ్ సినిమాలో కనిపించనున్నాడని పలు వార్తలను ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఈ నెల 25వ తారీకు నుంచి భారత జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నాడు.
కాగా ఇందులో ఇరు జట్లు ఈ వన్డే సిరీస్ లో మూడు సార్లు తలపడనున్నాయి.అలాగే మరో రెండు టి20లో కూడా తలపడనున్నాయి.