అష్టాద‌శ శ‌క్తిపీఠాలు...ఈ శ‌క్తిపీఠం స్పెష‌ల్.. అక్క‌డి వింత‌లు-విశేషాలు...  

Astadasa Sakthi Peetalu Kamakhya Devi Alayam Significance -

మ‌న దేశంలో దుర్గామాత‌కు చెందిన శ‌క్తిపీఠాలు మొత్తం 52 ఉన్నాయ‌ని అంద‌రికీ తెలుసు క‌దా.ఆ శ‌క్తి పీఠాల్లో అస్సాంలో ఉన్న కామాఖ్య ఆల‌యం శ‌క్తి పీఠం కూడా ఒక‌టి.

Astadasa Sakthi Peetalu Kamakhya Devi Alayam Significance

గౌహ‌తిలో ఈ ఆల‌యం ఉంది.నినాంచ‌ల్ ప‌ర్వ‌తాల‌పై స‌ముద్ర మ‌ట్టానికి 800 అడుగుల ఎత్తులో ఈ ఆల‌యాన్ని నిర్మించారు.

అయితే ఆల‌యంలో అమ్మ‌వారి చిత్ర‌ప‌టాలు, ప్ర‌తిమలు ఏమీ ఉండ‌వు.కానీ గ‌ర్భ‌గుడిలో అమ్మ‌వారి యోని ఉంటుంది.

అష్టాద‌శ శ‌క్తిపీఠాలు…ఈ శ‌క్తిపీఠం స్పెష‌ల్.. అక్క‌డి వింత‌లు-విశేషాలు…-Devotional-Telugu Tollywood Photo Image

దాన్నే భ‌క్తులు పూజిస్తారు.ఇక ఆ యోని విగ్ర‌హం ప‌క్క‌నే ఓ చిన్న‌పాటి ఏరు ప్ర‌వ‌హిస్తూ ఆ విగ్ర‌హాన్ని ఎప్పుడూ త‌డుపుతూ ఉంటుంది.

కామాఖ్య ఆల‌యం ఉన్న నినాంచ‌ల్ ప‌ర్వ‌తాల‌పై తారా, భైరవి, భువ‌నేశ్వ‌రి, ఘంట‌క‌ర్ణ ఆల‌యాలు కూడా ఉన్నాయి.

కామాఖ్య దేవి ఆల‌యాన్ని స‌రిగ్గా ఎప్పుడు నిర్మించారో తెలియ‌దు కానీ.16వ శ‌తాబ్దంలో మాత్రం ఆల‌యాన్ని ధ్వంసం చేశారు.తిరిగి 17వ శ‌తాబ్దంలో న‌ర నారాయ‌ణ అనే రాజు ఆల‌యాన్ని పున‌ర్నిర్మించాడు.

ప్ర‌స్తుతం మ‌న‌కు క‌నిపించే ఆల‌యం తేనె తెట్ట న‌మూనాను పోలి ఉంటుంది.ఆల‌య గోడ‌ల‌పై గ‌ణేషుడు, ఇత‌ర దేవుళ్లు, దేవ‌త‌ల చిత్రాలు మ‌న‌కు క‌నిపిస్తాయి.

ఆల‌యంలో మూడు ప్ర‌ధాన విభాగాలుంటాయి.ప‌శ్చిమం దిశ‌గా ఉన్న విభాగం పెద్ద‌గా, దీర్ఘ చ‌తుర‌స్రాకారాన్ని పోలి ఉంటుంది.

కానీ అందులోకి సాధార‌ణ భ‌క్తుల‌కు అనుమ‌తి ఉండ‌దు.ఇక మ‌ధ్య‌లో ఉన్న విభాగం చ‌తుర‌స్రం ఆకారంలో ఉంటుంది.

అందులో కామాఖ్య అమ్మ‌వారి చిన్న‌ ప్ర‌తిమ ఉంటుంది.ఈ విభాగం గోడ‌ల‌పై న‌ర నారాయ‌ణుల శిల్పాలు మ‌న‌కు క‌నిపిస్తాయి.

అలాగే ఇత‌ర దేవుళ్లు, దేవ‌తల చిత్రాలు కూడా మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి.

మ‌ధ్య విభాగం నుంచి గ‌ర్భ‌గుడికి వెళ్ల‌వ‌చ్చు.ఆ మార్గం గుహ‌ను పోలి ఉంటుంది.గ‌ర్భ‌గుడిలో అమ్మ‌వారి విగ్ర‌హం ఏమీ ఉండ‌దు.

అందుకు బ‌దులుగా యోని ఆకారంలో ఒక ప్ర‌తిమ ఉంటుంది.ఆ ప్ర‌తిమ‌ను ఎప్పుడూ నీరు తడుపుతూ ఉంటుంది.

అయితే ఈ ఆల‌యానికి సంబంధించిన క‌థ కూడా ఒక‌టి ప్ర‌చారంలో ఉంది.అదేమిటంటే.

త‌న తండ్రి ద‌క్షుడి అనుమ‌తి లేకుండా స‌తి (పార్వ‌తి) శివున్ని వివాహం చేసుకుంటుంది.అనంత‌రం ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

అయితే ఒక‌సారి ద‌క్షుడు య‌జ్ఞం చేస్తున్న‌ప్పుడు దానికి శివ‌పార్వతుల‌ను ఆహ్వానించ‌డు.కానీ పార్వ‌తి వెళ్దామంటుంది.

అందుకు కాద‌న‌లేక శివుడు కూడా ఆమె వెంట వెళ్తాడు.అయితే పిల‌వ‌ని పేరంటానికి ఎందుకు వ‌చ్చార‌ని ద‌క్షుడు వారిని హేళ‌న చేస్తాడు.

దీంతో ఆ అవ‌మాన భారాన్ని తట్టుకోలేక పార్వ‌తి య‌జ్ఞ‌పు అగ్ని కీల‌ల్లో ప‌డి ఆత్మార్ప‌ణం చేసుకుంటుంది.

దీంతో శివుడు ఉగ్ర రూపం వ‌హించి జ‌టా జూటాల‌ను విర‌బోసుకుని చేతుల్లో పార్వ‌తి మృత‌దేహాన్ని ప‌ట్టుకుని నాట్యం చేస్తుంటాడు.ఆ ధాటికి ముల్లోకాలు త‌ట్టుకోలేక‌పోతాయి.విష‌యం తెలుసుకున్న విష్ణువు వ‌చ్చి పార్వ‌తి శ‌రీరాన్ని త‌న సుద‌ర్శ‌న చ‌క్రంతో 52 ముక్క‌లుగా క‌త్తిరిస్తాడు.

ఆ ముక్క‌ల్లో పార్వ‌తి యోని తెగి ప‌డుతుంది.ఆ యోని ప‌డిన ప్రాంత‌మే ఇప్ప‌టి కామాఖ్య ఆల‌య‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి.

అయితే మిగిలిన 51 ముక్క‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప‌డ‌గా, అవి కూడా ఆల‌యాలుగా మారాయి.వాటిని భ‌క్తులు శ‌క్తి పీఠాలుగా కొలుస్తుంటారు.

కామాఖ్య ఆల‌యం ఉన్న ప‌ర్వ‌తాల‌కు కింది భాగంలో అసంపూర్తిగా మిగిలిన మెట్ల దారి మ‌న‌కు క‌నిపిస్తుంది.దీని వెనుక కూడా ఒక క‌థ ఉంది.పూర్వం న‌ర‌కుడ‌నే రాక్ష‌సుడు కామాఖ్య అమ్మ‌వారిని పెళ్లి చేసుకుటాన‌ని కోరిక కోర‌తాడ‌ట‌.అయితే ఆమె అందుకు అంగీక‌రిస్తుంది, కానీ ఒక ష‌ర‌తు పెడుతుంది.త‌న ఆల‌యం ఉన్న ప‌ర్వ‌తానికి మెట్ల దోవ‌ను రాత్రికి రాత్రే నిర్మించాల‌ని చెబుతుంది.అందుకు స‌రేన‌ని చెప్పిన న‌ర‌కుడు వెంట‌నే మెట్ల నిర్మాణం ప్రారంభిస్తాడు.

ఒక ద‌శ‌లో న‌ర‌కుడు మెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయ‌బోతాడు.కానీ అందుకు భ‌య‌ప‌డిన కామాఖ్య అమ్మ‌వారు కోడి రూపం ఎత్తి తెల్ల‌వార‌కున్నా కూస్తుంది.

దీంతో స‌మ‌యం అయిపోయింద‌ని, తాను ప‌నిలో విఫ‌లం అయ్యాన‌ని భావించిన న‌ర‌కుడు మెట్ల దోవ‌ను పూర్తి చేయ‌కుండానే వెనుదిరుగుతాడు.అందుక‌నే ఆ నిర్మాణం మ‌న‌కు అసంపూర్తిగా క‌నిపిస్తుంది.

ఇక ఆ మెట్ల‌దోవ‌ను మెఖెలౌజా దారి అని పిలుస్తారు.

కామాఖ్య అమ్మ‌వారికి నిత్యం విశేష పూజ‌లు చేస్తారు.ప‌లు ప్ర‌త్యేక సంద‌ర్భాల్లోనూ పూజ‌లు చేస్తారు.అమ్మ‌వారికి ఏటా దుర్గ పూజ చేస్తారు.

దీన్ని ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా నిర్వ‌హిస్తారు.అలాగే అంబువాసి పూజ కూడా చేస్తారు.

ఈ స‌మ‌యంలో మూడు రోజుల పాటు అమ్మ‌వారు రుతు స‌మ‌యంలో ఉంటుంద‌ట‌.అందుక‌నే ఆల‌యాన్ని మూడు రోజుల పాటు మూసేస్తారు.

అనంత‌రం పూజ‌లు నిర్వ‌హించి ఆల‌యాన్ని తెరుస్తారు.ఈ పూజ నెల‌కోసారి ఉంటుంది.

అలాగే శివ పార్వ‌తుల క‌ల్యాణం, ఫాల్గుణ మాసంలో దుర్గాదియ‌ల్ పూజ‌, చైత్ర మాసంలో వ‌సంతిపూజ‌, సంక్రాంతి, శ్రావ‌ణ మాసాల్లో మాన‌స పూజ చేస్తారు.మరి ఇన్ని విశిష్ట‌త‌లు ఉన్న ఈ ఆల‌యాన్ని చూడాలంటే.

ఇదే క‌రెక్ట్ టైం.ఒక‌సారి వెళ్లి రండి మ‌రి.!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Astadasa Sakthi Peetalu Kamakhya Devi Alayam Significance- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Astadasa Sakthi Peetalu Kamakhya Devi Alayam Significance-- Telugu Related Details Posts....

DEVOTIONAL