బాబ్రీ మసీదు కూల్చివేత కేసు లో ఈ రోజు తుది తీర్పు వెల్లడైన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిందితులు అందరూ కూడా నిర్దోషులే అంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించడం పై ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో అంతా నిర్దోషులే అయితే మరి మసీదును ఎవరు కూల్చారు? దానంతట అదే కూలిపోయిందా అంటూ ఓవైసీ ప్రశ్నించారు.బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని వ్యాఖ్యానించారు.మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసిందని, ఉమా భారతి మసీదును కూల్చండి అని నినాదాలు చేసిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ… చట్టాలను ఉల్లంఘించారని, పద్ధతి ప్రకారం ప్రార్థనా స్థలాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించిన విషయాన్ని ఒవైసీ గుర్తు చేశారు.
భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని, ఈ తీర్పును వెలువరించడం కోసం ఎంత కాలం కసరత్తు చేశారని అన్నారు.ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు.
మమ్మల్ని ఖతం చేసి మీరు పదవులు అనుభవించారని ఇప్పుడేమో మీ అందరికీ క్లీన్‌చిట్ వచ్చిందంటూ ఆయన మండిపడ్డారు.బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెల్లడించింది.మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడం లో సీబీఐ విఫలమైంది అంటూ జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు.
2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించి, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ తో సహా మొత్తం 32 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది.అయితే కోర్టు తీర్పు పై అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.