బచ్చా గాడే అవార్డు కొట్టేశాడు!       2018-06-17   03:17:10  IST  Raghu V

భారత దేశంలో సినిమా పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రధానం చేస్తూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమల వారు కూడా జాతీయ అవార్డు కోసం పోటీ పడుతూ ఉంటారు. జాతీయ అవార్డు తర్వాత అత్యంత క్రేజ్‌ ఉన్న అవార్డులు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు. చాలా సంవత్సరాలుగా అవార్డులు ఇస్తూ వస్తున్న ఫిల్మ్‌ ఫేర్‌ తాజాగా 2017 సంవత్సరానికి గాను అవార్డులను ఇవ్వడం జరిగింది. భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో సినీ తారలు మెరిశారు. అందరి అంచనాలకు తగ్గట్లుగానే తెలుగు చలన చిత్ర చరిత్రను తిరగ రాసిన బాహుబలికి ఎక్కువగా అవార్డులు వచ్చాయి. ఇక ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన బెస్ట్‌ హీరో అవార్డు మాత్రం విజయ్‌ దేవరకొండకు దక్కింది.

హైదరాబాద్‌లో జరిగిన 65వ సౌత్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల వారు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ వేడుకల్లో సౌత్‌కు చెందిన నాలుగు సినిమా పరిశ్రమలకు చెందిన అవార్డులను ప్రకటించారు. తెలుగు సినిమా విభాగం విషయానికి వస్తే ఉత్తమ చిత్రంగా అంతా ఊహించినట్లుగానే బాహుబలి 2 నిలిచింది. ఉత్తమ హీరోగా విజయ్‌ దేవరకొండ, ఉత్తమ హీరోయిన్‌గా సాయి పల్లవిలు అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ హీరోగా హేమా హేమీలు నామినేట్‌ అవ్వగా అర్జున్‌ రెడ్డి సినిమాకు గాను విజయ్‌ దేవరకొండకు దక్కడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.

2017 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుకు గాను ఉత్తమ హీరోలుగా ‘ఖైదీ నెం.150’ చిత్రానికి గాను చిరంజీవి, నాగార్జున, ‘జై లవకుశ’ చిత్రానికి గాను ఎన్టీఆర్‌, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి గాను బాలకృష్ణ, ‘బాహుబలి 2’కు గాను ప్రభాస్‌ు ఎంపిక అయ్యారు. వీరితో పాటు అర్జున్‌ రెడ్డి చిత్రానికి గాను విజయ్‌ దేవరకొండ నామినేషన్‌ను దక్కించుకున్నాడు. నామినేషన్స్‌లోనే తన పేరు రావడంతో విజయ్‌ దేవరకొండ ఉబ్బి తబ్బిబయ్యాడు. అంతటి లెజెండ్స్‌ పక్కన నా పేరు రావడం చూడ్డానికి చాలా సంతోషంగా ఉందని, నేనో బచ్చా గాడిని, నాకు ఆ అవార్డు వస్తుందని భావించడం లేదని, కాకుంటే నామినేట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, అవార్డు వచ్చినంత ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

నేనో బచ్చాగాడిని, నాకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వస్తుందా అని భావించిన విజయ్‌ దేవరకొండుకు అనుకోని అవకాశంగా అవార్డు దక్కింది. అర్జున్‌ రెడ్డిలో ఆయన కనబర్చిన అద్బుతమైన సహజ నటనకు గాను ఈ అవార్డును దక్కించుకున్నాడు. ప్రేక్షకులు మరియు జ్యూరీ మెంబర్స్‌ అంతా కూడా విజయ్‌ దేవరకొండకు భారీ ఓటింగ్‌ను ఇవ్వడం జరిగింది. విజయ్‌ దేవరకొండకు ప్రస్తుతం సినిమా పరిశ్రమ నుండి అభినందనలు, ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ ట్యాక్సీవాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.