గతంలో సైబర్ మోసగాళ్లు ప్రజల డబ్బును దోచేసేందుకు ఎస్ఎంఎస్ పంపించడం లేదా ఫోన్ కాల్ చేయడం వంటివి చేసేవారు.అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ టెక్నాలజీకి అలవాటు పడటంతో మోసగాళ్లు కూడా మోసాలు చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇందులో భాగంగా సోషల్ మీడియాలో మోసాలకు తెరలేపుతున్నారు.ముఖ్యంగా వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు.
ఇందులో కోట్లాది మంది యూజర్లు ఉంటారు కాబట్టి ఎవరికో ఒకరికి ఈజీగా టోకరా వేసి డబ్బులు కాజేయాలనుకుంటున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా వాట్సాప్ లో స్కామ్ మెసేజ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
విస్తుగొలిపే అంశం ఏమిటంటే.చాలా మంది యూజర్లు ఈ మోసగాళ్ల వలలో చిక్కి భారీ ఎత్తున నగదు కోల్పోతున్నారు.
ఈ సైబర్ కేటుగాళ్లు ఎమోషన్స్ అనే ప్రజల వీక్ నెస్ ని వాడుకొని చాకచక్యంగా మెసేజ్‌లు పంపిస్తున్నారు.అవి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి వచ్చిన మెసేజ్‌ల వలె ఉండటంతో యూజర్లు మరో ఆలోచన లేకుండా డబ్బులు పంపిస్తున్నారు.
తర్వాత అవి నకిలీవని తెలిసి లబోదిబోమంటున్నారు.
తాజాగా ఓ వాట్సాప్ స్కామ్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని యూకేకు చెందిన ప్రభుత్వ సంస్థ సఫోల్క్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ వెల్లడించింది.
సైబర్ చోరులు మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా నటిస్తూ ఫేక్ మెసేజ్‌లు పంపిస్తూ మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసే ప్రమాదముందని యూకే సంస్థ తెలిపింది.మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన వాట్సాప్ సంస్థ కూడా తన యూజర్లను హెచ్చరిస్తోంది.

కెస్సింగ్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళకు కొద్ది రోజుల క్రితం నేను మీ కూతురిని అంటూ గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది.ఆ గుర్తు తెలియని వ్యక్తి కూతురిలా నటిస్తూ తాను వాష్ రూమ్‌లో జారిపడి పోయానని.హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని మెడికల్ బిల్లు చెల్లించడానికి డబ్బులు పంపాలని కోరారు.అయితే అసలైన కూతురికి ఏమైందోనని ఫోన్ చేయగానే ఆమె ఏ హాస్పిటల్లో చేరడం లేదని తెలిసింది.
దాంతో అది మోసం అని గ్రహించిన ఆ తల్లి సైబర్ మోసగాళ్ల నుంచి తప్పించుకుంది.కానీ చాలామంది వాట్సాప్ మెస్సేజ్‌ల పట్ల జాగ్రత్త ఉండకుండా నిలువునా మోసపోతున్నారు.
ఇలా మోసపోకుండా ఉండాలంటే గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినా ఫోన్ కాల్ వచ్చినా.వెంటనే అప్రమత్తం కావాలి.వ్యక్తిగత వివరాలను, డబ్బులను ఎట్టిపరిస్థితుల్లోనూ సెండ్ చేయకూడదు.బ్యాంక్ వివరాలు ఇవ్వాలని అడిగినా.
లేదా మనీ సెండ్ చేయమని కోరినా.వారు మోసగాళ్లే అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.