బాబే కావాలి... టీడీపీ మళ్ళీ రావాలి .. సర్వేలో తేలింది ఇదే !       2018-05-19   01:20:59  IST  Bhanu C

రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండాలనేది నిర్ణయించేది ప్రజలే. అందుకే ఎన్నికల ముందే ప్రజల్లో తమ మీద ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది తెలుసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు సర్వేలను నమ్ముకుంటాయి. ఆ నివేదికల ఆధారంగా తమ పార్టీలో లోపాలను సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు రాష్ట్ర నిఘా వర్గాలు కూడా ఇప్పుడు సర్వేల పేరుతో రంగంలోకి దిగిపోయి భారీ స్థాయిలో సిబ్బందిని ఉపయోగించుకుని మరీ రిపోర్టులు సిద్ధం చేసింది. ఈ సర్వేలో ఏ పార్టీ మీద ఏ అభిప్రాయం ప్రజల్లో ఉంది అనేది తేలిపోయింది.

నిఘా విభాగం సిబ్బంది ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ .. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ కి అనుకూలత ఉంది ..? ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్యెల్యేల పరిస్థితి ఏంటి..? అభివృద్ధి, అవినీతి గురించి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాల మీద ప్రజల నుంచి వివరాలు రాబట్టారు. దీంట్లో మెజార్టీ ప్రజలు ఏపీలో తెలుగుదేశం పార్టీపై పూర్తి మక్కువ చూపిస్తున్నట్టు తేలింది. అలాగే… హోదా విషయంలో కేంద్రం పై అలుపెరగకుండా , పోరాడుతున్న ఘనత బాబు దే అని ప్రజలు బలంగా నమ్ముతున్నారట. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసినట్టు ప్రజలు భావిస్తున్నారని సర్వేలో తేలింది.

అలాగే ఏపీలో మిగిలిన పార్టీలైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ , జనసేన పార్టీలు బీజేపీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నాయని, అందుకే వారు హోదా విషయంలో మొక్కుబడి పోరాటాలు చేస్తున్నారు తప్ప సూటిగా కేంద్రాన్ని నిందించే సాహసం చేయడం లేదని ప్రజలు నమ్ముతున్నారు.

నిఘా వర్గాల నివేదిక ప్రకారం .. టీడీపీకి 58 % ఓట్లు, 131 సీట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 27 % ఓట్లు, 39 సీట్లు, జనసేనకు 6 % ఓట్లు, 05 సీట్లు, కాంగ్రెస్ , బీజేపీ, లెఫ్ట్ పార్టీలకు 9 % ఓట్లు, 0 సీట్లు వస్తాయని నిఘా వర్గాలు నివేదిక అందించాయి. మొత్తానికి చంద్రబాబు పరిపాలనను మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నట్టు అర్ధం అవుతోంది.

ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎన్ని కస్టాలు వచ్చినా అభివృద్ధి విషయంలో రాజీపడడం లేదని, అదే సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంతో ధైర్యంగా పోరాడుతున్నట్టు ప్రజల్లో బలంగా ఉంది. బాబు పాలనపై 80 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందారని, మిగిలిన 20 శాతం ఎమ్యెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కారణం అని , ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్యెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తే టీడీపీ మరింత మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు సర్వే రిపోర్ట్.