టీడీపీ సీనియ‌ర్‌కు గోతులు తీస్తోన్న మంత్రి   Ap Minister Conspiracy On Tdp Senior Leader     2017-01-10   05:59:46  IST  Raghu V

ఏపీ టీడీపీలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి పేరు చెపితే తెలియ‌ని వారు ఉండ‌రు. చంద్ర‌బాబు అండ‌దండ‌ల‌తో 1994, 1999 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి మంత్రి అయిన సోమిరెడ్డి వివాదాల‌కు దూరంగా రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరుంది. నెల్లూరు జిల్లా టీడీపీలో రెండు ద‌శాబ్దాలుగా కీల‌క‌పాత్ర పోషిస్తోన్న ఆయ‌నకు ఇప్పుడు అస్స‌లు టైం బాగోలేద‌ని, పూర్తిగా బ్యాడ్ టైం న‌డుస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

సోమిరెడ్డి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న 10 సంవ‌త్స‌రాల్లో అధికార కాంగ్రెస్‌కు ధీటుగా నిల‌బ‌డి పార్టీ నిల‌బెట్టారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇంకా చెప్పాలంటే సోమిరెడ్డి 2004-2009-2014 ఎన్నిక‌ల‌తో పాటు 2012 కోవూరు ఉప ఎన్నిక‌ల్లో ఇలా వ‌రుస‌గా నాలుగుసార్లు ఓడిపోయారు. అయినా చంద్ర‌బాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీ చేశారు.

సోమిరెడ్డికి కాలం క‌లిసి రాక ఓడిపోవ‌డంతో జిల్లాకే చెందిన నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ మంత్రి అయ్యారు. జిల్లా టీడీపీ అధ్య‌క్షుడుగా బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌ను టీడీపీ అధినేత ఎంపిక చేశారు. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి సోమిరెడ్డిని తీవ్రంగా తొక్కి వేస్తున్నార‌న్న టాక్ నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. వీరు డైరెక్టుగా సోమిరెడ్డిని ఇబ్బంది పెట్ట‌డం కంటే ఆ ప‌నిని విప‌క్ష నేత‌ల ద్వారా చేయిస్తున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌త కొద్ది రోజులుగా వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి సోమిరెడ్డిపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. సోమిరెడ్డికి సంబంధించిన ప‌లు కీలక అంశాల‌పై ఉప్పందించి ఆయ‌న సోమిరెడ్డిని విమ‌ర్శించేలా నారాయ‌ణ‌-బీద రవిచంద్ర యాద‌వ్ తెర‌వెన‌క ఉండి క‌థ న‌డిపిస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. కాకాని త‌న‌పై చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై సోమిరెడ్డి మాత్ర‌మే స్పందిస్తున్నారు.

ఆయ‌నకు ఈ విష‌యంలో జిల్లాకు చెందిన టీడీపీ నేత‌లు ఎవ్వ‌రూ మ‌ద్ద‌తుగా ఉండ‌డం లేదు. ఏదేమైనా సోమిరెడ్డి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే త‌న‌కు పోటీలో ఉంటార‌న్న భ‌యంతోనే నారాయ‌ణ, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌తో క‌లిసి ఆయ‌న్ను టార్గెట్ చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి.

,