ఏపీలో కాంగ్రెస్‌ మెరుగు పడిందా?       2018-06-07   00:37:11  IST  Bhanu C

ఏపీలో రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుంది. 2014లో ఆంధ్ర ప్రదేశ్‌ రెండుగా విడిపోయాక రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు తారు మారు అయ్యాయి. రాష్ట్ర విభజన తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని భావించారు. కాని తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణలో 2019లో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ కూడా 2019 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఏపీ పరిస్థితి తల పండిన రాజకీయ నాయకులకు కూడా అర్థం అవ్వడం లేదు.

ఏపీలో ప్రస్తుతం టీడీపీలో అధికారంలో ఉంది. 2014 ఎన్నికల్లో వైకాపాకు భారీగానే సీట్లు, ఓట్లు వచ్చాయి. స్వల్ప తేడాతో వైకాపా అధికారంకు దూరం అయ్యింది. కాంగ్రెస్‌ తీరని అన్యాయం చేసిందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీని ఏపీలో నామరూపాలు లేకుండా అక్కడి ప్రజలు చేశారు. కాంగ్రెస్‌ పుంజుకోవడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని అంతా భావించారు. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు జీవం వచ్చినట్లవుతుంది. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అంతో ఇంతో ప్రభావం చూడం ఖాయం అనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ, వైకాపా, జనసేన, బీజేపీలతో పాటు కాంగ్రెస్‌ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందనే విషయం స్పష్టంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు, తాము ఇచ్చిన హామీని బీజేపీ వారు పట్టించుకోవడం లేదు అంటూ ప్రచారం చేయగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్‌కు మంచి అవకాశం ఉంటుందని, బహుముఖ పోటీలో కాంగ్రెస్‌కు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఏపీపై ఇటీవలే కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ప్రచారంతో ఊదరగొడితే ఖచ్చితంగా 5 నుండి 10 స్థానాలను సొంతం చేసుకోవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ స్థాయిలో సీట్లు వచ్చినా కూడా చాలా చాలా గొప్పే అని చెప్పుకోవచ్చు. 5 స్థానాలు వచ్చినా కూడా వారి మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు చాలా కీలకం అయ్యే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో కృషి చేసి పార్టీని నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, అలా కేంద్రంలో అధికారం దక్కించుకుంటే ప్రత్యేక హోదా నె రోజుల్లోనే తీసుకు వస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగు పడినదని చెప్పుకోవచ్చు.