రాజ‌ధానిలో ఏపీ స‌ర్కార్ ప్లాప్ షో     2017-01-06   00:34:29  IST  Bhanu C

రాజ‌ధాని గ్రామాల్లో భూసేక‌ర‌ణ వివాదాస్ప‌దంగా మారుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ కాంతిలాల్ దండే విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌పై ఆయా గ్రామాల ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. ప్రజా రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌మ భూములిచ్చిన విష‌యం తెలిసిందే! అయితే ఎవ‌రినీ బ‌ల‌వంత పెట్ట‌మ‌ని, న‌చ్చిన వారు ఇస్తేనే తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం వాటిని గాలికి వ‌దిలేసింది.

అబ్బురాజు వారిపాలెంలో దాదాపు పది ఎకరాలు, ఐనవోలులో 13 ఎకరాలు, బోరుపాలెంలో 34 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 29 ఎకరాలు సేకరిస్తామని చెబుతున్నా ఇవన్నీ ఇళ్లనూ, గ్రామ కంఠాలను ఆక్రమించేవిగా ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. అమరావతిలో భూ సేకరణకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే విడుదల చేసిన నోటిఫికేషన్ ఊళ్లు, ఇళ్లకూ కూడా ఎసరు పెట్టడం ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీస్తోంది.

ఎకరా కూడా బలవంతంగా కూడా తీసుకోబోమని ఇళ్ల‌కూ, గ్రామ‌కంఠాల‌కూ ఎలాంటి ముప్పూ ఉండ‌ద‌ని చెప్పిన ప్ర‌భుత్వ మాట‌.. ఇప్పుడు నీటిమూట‌గా మారింద‌ని ఆయా గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర నిర‌స‌న వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఐన‌వోలులో 43 ఇళ్లను తొల‌గిస్తున్నారు. క్రీడా భూములనే గాక గ్రామాలనే స్వాధీనం చేసుకోవడంపై ఆ గ్రామాల ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

ఇళ్లను తీసుకోబోమన్న మంత్రి నారాయణ ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేశారని సర్పంచి జ్ఞానానందం ప్రశ్నిస్తున్నారు. అప్పుడు చూపిన ప్లాను వేరు ఇప్పుడు చెబుతున్నది వేరు అని వారంటున్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా ఎండ్రిన్‌ ఇస్తే తాగి ప్రాణత్యాగం చేస్తామని, అప్పుడు పొలాలు ఇళ్లు, స్థలాలు తీసుకోవ‌చ్చ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. మొదట పొలాలు ఇవ్వడమే తప్పని వాపోతున్నారు. అధికారులు వస్తే కొట్టిపంపిస్తామని కూడా కొందరు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.