వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది.151 సీట్లు గెలుచుకుని తన టాలెంట్ ఏంటో జగన్ నిరూపించుకున్నాడు.దీంతో జగన్ ఏపీలో ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా వ్యవహారం ఉంటుందని అని అంతా భావిస్తూ వస్తున్నారు.అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అన్ని ఇబ్బంది లేనన్న విషయం ఆ పార్టీ నేతలు కాస్త ఆలస్యంగా గుర్తించారు.
ఇప్పటికే జగన్ తలకు మించిన భారమైన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు.దీంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాడు.వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలకు వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంది.కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా బాగా తగ్గిపోయాయి.
మరో వైపు చూస్తే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.అది కాకుండా రైతుల సంక్షేమం కోసం ప్రతి రైతు ఎకౌంట్లో 12,500 రూపాయలను ఈ 15వ తేదీన వేయాల్సి ఉంది.
ఇలా సుమారు 50 లక్షల మందికి లబ్ది చేకూరాలంటే భారీ మొత్తమే కావాలి.కానీ ఇప్పటికీ వాటికి నిధులు సర్దుబాటు కాలేదు.

ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటే దిక్కని జగన్ భావిస్తున్నాడు.అందుకే ఈరోజు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాడట.వాస్తవానికి జగన్ ఐదు రోజుల కిందటే ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు.అప్పుడు అక్కడ మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోలేదు.ఆ సమయంలో కేంద్ర హోంమంత్రి, బిజెపి చీఫ్ అమిత్ షా తో పాటు కీలకమైన మంత్రులను కొంతమందిని కలవాలని జగన్ ప్రయత్నించినా, వారి అపాయింట్మెంట్ లభించలేదు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ వారి అపాయింట్మెంట్లు ఖరారు చేసుకుని నేడు ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
ఈ పర్యటన లో ఏపీ ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను గురించి చర్చించటమే కాకుండా తన కేసుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండేలా జగన్ ప్రయత్నిస్తున్నాడు.

ఎందుకంటే ఇటీవల సిబిఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు విషయంలో జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై సిబిఐ వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేయడం జగన్ కు ఇబ్బందిగా మారింది.ముందు ముందు తన కేసుల విషయంలో సిబిఐ దూకుడుకి బ్రేకులు వేయించేందుకు జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు మళ్లీ ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.అయితే జగన్ విషయంలో బిజెపి పెద్దలు ఏ విధంగా ముందుకు వెళ్తారనేదే సస్పెన్స్ గా మారింది.
ఎందుకంటే ఏపీ బీజేపీ నాయకులు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ ఇబ్బందికరంగా మారారు.కానీ వారిని పల్లెత్తు మాట కూడా అనకుండా వైసీపీ ప్రభుత్వం సమన్వయం పాటిస్తూ వస్తోంది.
కేంద్రంతో సఖ్యత కోసమే జగన్ అలా చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుంటే ఏపీలో బీజేపీ నాయకుల ఎదురుదాడి నుంచి తప్పించుకోవచ్చని కూడా జగన్ భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది.