ఆయన పోరాటమే అధికారం తెచ్చిందంట..అందుకే బాబు ఆరాటం       2018-07-04   02:45:13  IST  Bhanu C

చంద్రబాబు వ్యవహారశైలి ఎందుకో ఈ మధ్య కాలంలో చాలా మారిపోయింది. గతంలో ఎప్పుడూ ఒక రాజకీయ నాయకుడిని తమ పార్టీలోకి రావాలని బహిరంగంగా పిలిచిన సందర్భాలు ఇప్పటివరకు లేవు. అది చంద్రబాబు సిద్ధాంత కూడా కాదు. కానీ ఈ మధ్య ఆయన తన సిద్ధాంతాన్ని పక్కనపెట్టేసినట్టు కనిపిస్తోంది. పార్టీలోకి రావాలంటూ ఓ ఎన్జీవో నాయకుడిని ఒకటి కాదు రెండు సార్లు బహిరంగంగానే కోరడంపై పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు పై బాబుకి ప్రేమ పొంగిపోతోంది. అందుకే అశోక్‌బాబు పార్టీలోకి రావాలి. వస్తే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం!` అంటూ చంద్రబాబు రెండు సార్లు ఆయన్ను ఆహ్వానించారు. పరిస్థితులు ఎంతటి బలవంతుడినైనా లొంగదీసుకుంటాయనేందుకు ఇదే నిదర్శనమనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు వ్యవహారశైలి గమనించిన వారు.. ఇలా ఒక ఎన్జీవో నాయకుడిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం ఏమిటా అని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై అంత మమకారం.. ప్రేమ ఎందుకు పొంగుకొస్తున్నాయనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్యెల్యేల మీద అనేక అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఈ సమయంలో టీడీపీని గట్టెక్కించే వారు ఎవరో ఒకరు కావలి. ఆయనే అశోక్ బాబు అని బాబు బలంగా నమ్ముతున్నాడు.

రాష్ట్ర విభజన సమయంలో.. ఉద్యోగులందరికీ నాయకత్వం వహించి.. వాళ్లంతా బాబు వైపు మొగ్గుచూపేలా చేయడంలో అశోక్‌బాబు పోషించిన పాత్ర ఎంతో ఉంది. అప్పటి నుంచి చంద్రబాబుకు అశోక్‌బాబుపై మమకారం పెరిగింది. పార్టీలోకి ఆయన్ను ఆహ్వానిస్తే మరింత మేలు జరుగుందని అనుకున్నారో ఏమో కానీ పదే పదే ఆయనకు ఆహ్వానాలు పలుకుతున్నాడు.

మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న అశోక్‌బాబు టీడీపీలో చేరి క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఏపీ భవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన సందర్భంగా ఎన్జీవోలు తీవ్ర పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌ బాబు ఎప్పుడు పార్టీలో చేరినా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బాబు వ్యవహారం తెలుగు తమ్ముళ్లకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. ఆయన ఒక్కడు పార్టీని నెగ్గించేస్తాడా..? అసలు ఆయన చెప్తే ఉద్యోగులు ఓట్లు వేసే పరిస్థితి ఉందా..? బాబు ఎందుకు ఇలా దిగజారి మరీ మాట్లాడుతున్నాడు అంటూ మండిపడుతున్నారు. బాబు మాత్రం అశోక్ బాబు విషయంలో ఇవేవి పట్టించుకునే పరిస్థితిలో కనిపించడంలేదు.