పగబట్టిన బాబు .. పొగ పెట్టాలని చూస్తున్నాడు       2018-07-04   00:11:21  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు ఏమి చేసినా ఆహా .. ఓహో .. అద్భుతం అంటూ మీడియాలో వస్తుంటాయి. నిరంతరం బాబు ని ఆకాశానికి ఎత్తేస్తూ కథనాలే మీడియాలో వండి వారుస్తుంటారు. దానికి ప్రధాన కారణం ఆ మీడియా అధినేతలంతా బాబు సామాజికవర్గం వారే. ఆ అభిమానంతోనే లేక ఇంకేదైనా ప్రతిఫలం ఆశించో తెలియదు కానీ ఎప్పుడూ టీడీపీ అనుకల కథనాలే తప్ప ప్రతికూల కథనాలు ప్రచారం కావు. ఇంతవరకు బాబుగానే మేనేజ్ చేసుకుంటూ వస్తున్న బాబు కి ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.

చంద్రబాబు గొప్పను మాత్రమే ప్రధాన మీడియా ప్రచారం చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు పాలనలోని అసలు లోపాలు, అవినీతి, అక్రమాలు, వైఫల్యాలు మాత్రం జనాల్లోకి చాలా బలంగా వెళ్లిపోతున్నాయి. లోకేష్ ప్రసంగాల నుంచి.. చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యల వరకు.. జనంలోకి క్షణాల్లో చేరిపోతున్నాయి. ఆఖరికి లోకేష్ అంటే సోషల్ మీడియాలో ఒక కమెడియన్ . అందరికి వినోదం పంచే ఒక స్టార్ . ఆ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆయన్ను వాడేసుకుంటున్నారు.

సోషల్ మీడియా దెబ్బ ఏంటో బాబుకి తెలియంది కాదు. అంతెందుకు 2014కు ముందు సోషల్‌ మీడియాలో టీడీపీ చేసిన ప్రచారం.. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు చేసిన పన్నాగాలు అన్నిఇన్నీ కాదు. అవన్నీ ఫలించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా టీడీపీని అధికారానికి దూరం చేసేలా కనిపిస్తోంది.

దీక్షలను, రైల్వే జోన్‌ను హేళన చేస్తూ టీడీపీ ఎంపీలు మాట్లాడుకున్న వీడియో బయటకు రావడంతో పార్టీకి భారీగానే నష్టం జరిగింది. టీవీ చానళ్లను నియంత్రించినా.. సోషల్ మీడియా ను మాత్రం అడ్డుకోలేకపోయారు. నిజానికి సోషల్ మీడియాలో టీడీపీ కంటే ఇతర పార్టీల వారే చాలా దూకుడుగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పనులు సమర్ధించుకునే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ అనుకూల నెటిజన్లు పెద్దగా ముందుకెళ్లలేకపోతున్నారు.

అదే సమయంలో కోట్లు చెల్లించి కొన్ని సంస్థలను సోషల్ మీడియా ప్రచారం కోసం చంద్రబాబు నియమించుకున్నా. నెటిజన్ల దూకుడు ముందు అవేవీ నిలబడడం లేదు. దీంతో సోషల్ మీడియాను నియంత్రించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం అనేక ఎత్తులు పన్నుతున్నారు. వైసీపీ నెటిజన్లపై కేసులు పెట్టడం, వారిని బెదిరించడం వంటి చర్యలకు దిగుతున్నారు.

సోషల్ మీడియాలో తొలుత పైచేయి సాధించేందుకు ప్రయత్నించినా అది విజయవంతం కాకపోవడంతో ఇప్పుడు దాన్ని నియంత్రించాలి అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనం కూడా ప్రచారం చేసింది. కానీ సోషల్ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకోవడం అంత ఆషామాషీ కాదు. ఇటీవల సుప్రీం కోర్ట్ కూడా సోషల్ మీడియాను అడ్డుకోవడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకున్నట్టే అని చెప్పింది. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలా అనే ఆలోచనలో బాబు ఉన్నాడు.