స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scam ) లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు నేడు సిఐడి విచారణ ఎదుర్కొబోతున్నారు.ఈ మేరకు చంద్రబాబును రెండు రోజులు పాటు కస్టడీకి అనుమతించాలని కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబును నేడు, రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే సిఐడి అధికారులు విచారించనున్నారు.ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ పిటిషన్ మేరకు ఈ విచారణ జరగనుంది.
సిఐడి కస్టడీ నేపథ్యంలో ఏసీబీ కోర్టు అనేక నిబంధనలను జారీ చేసింది.ముఖ్యంగా విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, అలాగే న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించేందుకు అనుమతించారు.ఇక ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలని, భోజన విరామం గంటసేపు ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.అలాగే విచారణ జరుగుతున్న వీడియో, ఫోటోలు విడుదల చేయకూడదని షరతులు కూడా విధించారు.ఈ విచారణ సందర్భంగా చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.

సిఐడి అధికారులు చంద్రబాబును ఏ అంశాలపై ప్రశ్నిస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ఇక ఈ వ్యవహారం ఇలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు( Chandrababu Naidu )తో ఇప్పటికే టిడిపి లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మీనారాయణ( Advocate Lakshminarayana ) మూలాఖత్ అయ్యారు.అనేక పిటిషన్లు సంబంధించి చంద్రబాబు వద్ద సంతకాలను స్వీకరించారు.
అలాగే కోర్టు తీర్పుల పైన చంద్రబాబుతో చర్చించారు.ఏపీ సిఐడి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ల విషయం పైన న్యాయవాది లక్ష్మీనారాయణ చంద్రబాబుతో చర్చించారు.
ఇక నేడు జరిగే సీఐడీ విచారణలో చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు అనేదానిపై ఈ కేసు వ్యవహారం ముడిపడి ఉంది.