ఏపీ బీజేపీలో కష్టాల సునామి ఈదలేకపోతున్న నాయకులు   Ap Bjp Party In Deep Trouble About Elections     2018-07-10   01:46:47  IST  Bhanu C

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారయ్యింది ఏపీ బీజేపీ పరిస్థితి. చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అని గొప్పగా ఉన్నా .. ఏపీలో మాత్రం ఆ పార్టీ సున్న. ప్రజా బలం ఏమాత్రం లేకపోయినా ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం మాత్రం ఆగడంలేదు. ముందస్తు ఎన్నికలంటూ కంగారు పడుతున్న ఆ పార్టీకి ఏపీలో పోటీ చేసేందుకు మాతం నాయకులు ఎవరూ కనిపించడంలేదు.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎవరెవరు పోటీచేస్తారు? అంటే పట్టుమని పదిమంది పేర్లు కూడా కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో మోదీ హవాతో టీడీపీ అండతో పోటీచేసినా.. అక్కడక్కడా మాత్రమే ఆదరణ లభించింది. ఇదే సమయంలో పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేసినా అవన్నీవర్కవుట్ కాలేదు. ఇక టీడీపీతో దోస్తీ చెడిపోయిన తర్వాత కమలనాథులకు ఎదురుదెబ్బలు తగులుతూనే వస్తున్నాయి. ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే ఇప్పుడు పార్టీలో సీనియర్లకు సంకటంగా మారింది. అటు పార్టీలో ఉండలేక.. ఇటు ఇతర పార్టీల్లో చేరలేక సతమతమవుతున్నారు.

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో పార్టీ సీనియర్లు కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. అధిష్టానం తమను పోటీచేయాలని ఆదేశిస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారట. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారంతా టీడీపీ అధినేత చంద్రబాబుతో గల వైరంతో.. బీజేపీలో చేరిపోయారు. మిత్రత్వం కొనసాగిన సందర్భంలోనే అడపా దడపా బాబుపై విమర్శలు గుప్పించేవారు. అయితే ప్రస్తుతం టీడీపీతో కటీఫ్‌, విభజన హామీలు అమలుచేయలేదని చంద్రబాబు చేస్తున్న ప్రచారం, ఇతర అంశాలతో కమలనాథులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సీనియర్లలో గుబులు మొదలైందట.

ఒకవేళ పార్టీ తరఫున బరిలోకి దిగినా ప్రయోజనం ఉండదని సర్వేలు తేల్చి చెప్పేయడంతో కమలనాధులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర బీజేపీలో గ్రూపులు పెరుగుతున్నాయి. కంభంపాటి హరిబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు గ్రూపులుగా ఉన్న బీజేపీలో ఈ మధ్యకాలంలో మరిన్ని గ్రూప్ లు తయారయ్యి ఎవరికీ వారే యమునాతీరే అన్నట్టుగా ఉన్నారు. ఇదే ఇప్పుడు బీజేపీలో ఆందోళన పెంచుతోంది.