ప్రభాస్‌ రానాల కలయిక మరో బ్లాక్‌ బస్టర్‌ ఖాయమేనా       2018-07-03   01:59:12  IST  Raghu V

‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌, రానాలు కలిసి నటించిన విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ హీరోగా రానా విలన్‌గా నటించారు. వీరిద్దరు మంచి స్నేహితులు అవ్వడంతో మరోసారి వీరి కాంబోలో మూవీ వస్తుందని అప్పటి నుండే ప్రచారం జరుగుతుంది. తాజాగా వీరిద్దరు ఒక సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన దశరథ్‌ ఆ తర్వాత అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్‌ ప్రస్తుతం ప్రభాస్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే ప్రభాస్‌ను కలిసి దర్శకుడు దశరథ్‌ స్టోరీ లైన్‌ను వినిపించినట్లుగా తెలుస్తోంది. స్టోరీకి ఇంప్రెస్‌ అయిన ప్రభాస్‌ తప్పకుండా సినిమా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడట. ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర కోసం రానాను తీసుకుందాం అంటూ దశరత్‌ సూచించడం, అందుకు ప్రభాస్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందని సమాచారం అందుతుంది. మొత్తానికి త్వరలోనే ప్రభాస్‌ మరియు రానాల కలయికలో మరో సినిమాకు రంగం సిద్దం అవుతుంది. రానా ఈమద్య కాలంలో సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. రెండు మూడు సినిమాలు చేస్తున్నప్పటికి అవి ఎప్పటికి విడుదల అవుతాయో క్లారిటీ లేదు.

ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే దుబాయిలో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చిన ‘సాహో’ టీం హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ రేంజ్‌లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం తర్వాత ‘జిల్‌’ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రభాస్‌ చేయాల్సి ఉంది. ఆ రెండు చిత్రాల తర్వాత దశరథ్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అనిపిస్తుంది.

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దశరథ్‌తో సినిమా అనగానే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మరోసారి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ను ఊహించుకుంటున్నారు. మరి సినిమా రానాతో కలిసి ప్రభాస్‌ చేయబోతున్న ఈ మల్టీస్టారర్‌ ఫ్యామిలీ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. వచ్చే ఏడాది ప్రభాస్‌, దశరథ్‌ల కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.