బిగ్‌బాస్‌ నాల్గవ వారం ఎలిమినేషన్‌.. కాస్త గందరగోళం       2018-07-08   21:59:25  IST  Raghu V

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మెల్ల మెల్లగా ఊపందుకుంటుంది. మొదటి రెండు వారాలు పెద్దగా ఆసక్తి లేకుండా సాగిన బిగ్‌బాస్‌ మూడవ వారం నుండి ఆసక్తికరంగా మారింది. మూడవ వారం బిగ్‌బాస్‌ సీజన్‌ 2 నుండి కిరీటి ఎలిమినేట్‌ అవ్వగా, నాల్గవ వారం ఎలిమినేషన్‌ ఖచ్చితంగా గణేష్‌ అనుకున్నారు అంతా. కాని ఆశ్చర్యంగా గణేష్‌ శనివారంనాడే సేఫ్‌ జోన్‌కు వెళ్లి పోయాడు. ఇక ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో యాంకర్‌ శ్యామలను ఎలిమినేట్‌ చేయడం జరిగింది. హౌస్‌లో బలమైన కంటెస్టెంట్‌ అంటూ శ్యామలను ఇన్నాళ్లు అంతా అనుకున్నారు.

ప్రేక్షకులు అంతా కూడా శ్యామలకు బాగానే మద్దతుగా నిలిచారు. కాని శ్యామలకు తక్కువ ఓట్లు పడ్డాయి అంటూ ఎలిమినేషన్‌ జాబితాలో ఉంచడం, తేజస్వి మరియు కౌషల్‌లు శ్యామలను ఇంట్లో వద్దనుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వెళ్లి పోయింది. శ్యామల ఇంట్లో అమ్మలా, అందరి అవసరాలు తీర్చుతూ అందరి మనస్సులను గెల్చుకుంది. అందుకే శ్యామల ఎలిమినేషన్‌ అనగానే అంతా కూడా బ్యాడ్‌ మూడ్‌ ఏర్పడటం జరిగింది. శ్యామల ఎలిమినేషన్‌ అయిన విషయం ఆదివారం ఉదయమే అందరికి తెలిసి పోయింది.

సహజంగా బిగ్‌బాస్‌లో మనం నేడు చూస్తున్న ఎపిపోడ్‌ నిన్న జరిగిందన్నమాట. ఆదివారం కోసం శనివారం షూట్‌ చేయడం జరిగింది. శనివారం రాత్రికి శ్యామల ఇంటికి చేరిపోయింది. ఆదివారం ఉదయం తన అధికారిక ఫేస్‌బుక్‌లో ఇంటికి వచ్చేశాను, కొడుకుతో ఆడుకుంటున్నాడు, ఇంటి సభ్యులందరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ను కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె డిలీట్‌ చేయడం జరిగింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఆ పోస్ట్‌ను కొందరు స్క్రీన్‌ షాట్స్‌ తీసుకుని పెట్టేసుకున్నారు.

సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో శ్యామల ఎలిమినేట్‌ కాబోతుందని ప్రచారం జరిగింది. టీవీ ఛానెల్స్‌ ఈ విషయంలో కాస్త సంయమనం పాటించారు. అయితే సోషల్‌ మీడియా ప్రముఖంగా ఉన్న ఈ సమయంలో ఆ విషయం దాదాపు అందరికి తెలిసి పోయింది. ఈ విషయంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు శ్యామలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కిరీటి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన ఎలిమినేషన్‌ కూడా ముందే లీక్‌ అయ్యింది. అందుకే వచ్చే వారం నుండి బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ విషయాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు ఎలిమినేషన్‌ అయిన వారిని ఆదివారం ఎపిసోడ్‌ పూర్తి అయ్యే వరకు హౌస్‌లోనే ఉంచేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.