నేను టీడీపీలో ఉండ‌లేను.... బిగ్ వికెట్ డౌన్‌కు ముహూర్తం       2018-06-14   00:06:37  IST  Bhanu C

తెలుగు రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రు అయిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా ఆనం పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆనం సోద‌రులు ఎన్టీఆర్ హ‌యాంలో టీడీపీలోనే ఉండేవారు. ఆ త‌ర్వాత వైఎస్‌కు ద‌గ్గ‌రై ద‌శాబ్ద కాలం పాటు నెల్లూరు జిల్లాను ఏక‌చ‌క్రాధిప‌త్యంగా ఏలూతు త‌మ‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు. 2004, 09 ఎన్నిక‌ల్లో ఆనం సోద‌రులు ఇద్ద‌రూ అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

-

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆర్థిక‌శాఖ లాంటి కీల‌క శాఖ‌ను ఆయ‌న ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి మంచి పేరు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆత్మ‌కూరు నుంచి రామ‌నారాయ‌ణ‌రెడ్డి పోటీ చేసి ఓడిపోగా, ఆనం వివేక పోటీకి దూరంగా ఉండి త‌న కుమారుడిని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ ఏపీలో కొట్టుకుపోవ‌డంతో ఆనం ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ఇద్ద‌రూ ఓడిపోయారు.

ఆ త‌ర్వాత త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వీళ్లు టీడీపీలో చేరారు. ఆనం సోద‌రులు టీడీపీలో చేరిన‌ప్పుడు ఎంతో ఆశించారు. చంద్ర‌బాబు నుంచి త‌మ‌కు ఎన్నో హామీలు వ‌చ్చిన‌ట్టు చెప్పుకున్నారు. దివంగ‌త ఆనం వివేక త‌న‌కు ఎమ్మెల్సీ వ‌స్తుంద‌ని చివ‌రి వ‌ర‌కు వెయిట్ చేశారు. ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌న మృతిచెందారు. ఇక రామనారాయ‌ణ‌రెడ్డికి ఆర్థిక‌మంత్రి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే చంద్ర‌బాబు ఈ ఫ్యామిలీకి కేవ‌లం ఆత్మ‌కూరు సీటు ఒక్క‌టి మాత్ర‌మే ఇచ్చారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. దీనిపై కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న ఆయ‌న తాజాగా క్లారిటీ ఇచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో ఆయన తన బాధ‌ను పంచుకున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో తాను ఇమడలేనని ఈ సందర్భంగా ఆయన చెప్పేశారు. పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

అయితే ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు ఆనం చెప్పడం విశేషం. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. దీనిని బ‌ట్టి ఆయ‌న టీడీపీ వీడ‌డం దాదాపు ఖ‌రారైపోయింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.