తెలంగాణాలో బలపడేందుకు బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.దానికోసం తమకు కలిసి వచ్చే అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగానే తెలంగాణ జిల్లాల్లోని అన్ని పార్టీల్లో ఉన్న బలమైన, ప్రజాధారణ ఉన్న నాయకులను గుర్తించే పనిలో పడింది.ఇలా గుర్తించినవారిని బీజేపీలో చేరేలా బుజ్జగింపులు, ఒత్తిళ్లు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అధికార పార్టీ టీఆర్ఎస్ లో అలుముకున్న అసంతృప్తి జ్వాలలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇదే సరైన సమయం అని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు.దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడట.
పార్టీ సభ్యత్వ నమోదును హైదరాబాద్ నుంచే ప్రారంభించారు.అంతేగాక బలం పెంచుకునేందుకు వివిధ పార్టీల నుంచి చేరికలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి తిరుగు ఉండదని, ఇక తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చాలామంది నాయకులు బలంగా నమ్ముతున్నారు.అందుకే వివిధ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.అయితే కాస్త పలుకుబడి గల జనాకర్షక నాయకుల కోసం బీజేపీ ఎదురుచూపులు చూస్తోంది.ఇప్పటికే అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ నాయకులపై ఆపార్టీ గురిపెట్టింది.ఎమ్మెల్యే, ఎంపీ స్ధాయి వ్యక్తులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈనెల 17న రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షా సమక్షంలో టీఆర్ఎస్‌లోని కీలక నాయకులు చేరబోతున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ ఎస్ అ ధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జోరందుకుంది.
పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ అగ్ర నాయకులకు సమాచారం ఉన్నా ఏకంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారనే వార్త టీఆర్ఎస్ లో కాక రేపుతోంది.ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నేతల చేరికలు పూర్తవ్వవగానే జిల్లా స్థాయి నేతల చేరికలపై దృష్టిపట్టి మరింత పటిష్టం అవ్వాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది.ముఖ్యంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొంతమంది నాయకులను గుర్తించి వారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదింపులు చేస్తోంది బీజేపీ.
అటువంటి వారిని చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ కు షాక్ ఇవ్వడంతో పాటు బీజేపీ హవా మరింత పెరిగినట్టు నిరూపించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
.