సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను మనదేశంలో ప్రజలు దైవంగా భావిస్తారు.వారు జనంపై, సమాజంపై వేసే ముద్ర అలాంటిది.
అందుకే అంతటి ఫాలోయింగ్.తమ అభిమాన హీరో, హీరోయిన్, క్రీడాకారుడు, నాయకులను జనం బాగా అనుకరిస్తారు.
షూ దగ్గరి నుంచి హెయిర్ స్టైల్ వరకు ఇలా ఆ పాదమస్తకం మక్కీకి మక్కీ దింపే వారు మన చుట్టూ కొకొల్లలు.ఈ సంగతి పక్కనడబెడితే… అమెరికా ఉపాధ్యక్షురాలిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కు ఇప్పుడు అగ్రరాజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు.
ప్రస్తుతం ఆమె క్రేజ్ ఇప్పుడు ఆకాశమంత.
ఎంతలా అంటే… ఆమె వేసుకునే సాక్స్‌ని కూడా ఎగబడి కొంటున్నారు అమెరికన్లు.
దీంతో ఆ సాక్స్ తయారు చేసిన కంపెనీ సంబరాల్లో మునిగిపోతోంది.అవి ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
దీని వెనక ఓ ఆసక్తికర కథనం వుంది.కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్… ఓ వీడియోని టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అందులో మీనా… హారిస్‌కి పీచ్ పండ్ల ఫ్లేవర్ ఉన్న మింట్స్ జార్ ఇచ్చారు.అలా ఇస్తూ… “ఇం”పీచ్””మింట్స్” అనే డైలాగ్ వాడారు.
తొలుత ఆ ఇంపీచ్మింట్స్ పదానికి ఉన్న అర్థాన్ని కమలా హారిస్ గుర్తించలేదు.వెంటనే తేరుకుని పకపకా నవ్వేశారు.
ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన.ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని పదవిలోంచి దించేందుకు రెండోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని గుర్తుచేస్తూ మీనా హారిస్… ఇలా పీచ్ పండ్ల ఫ్లేవర్ మింట్స్ ఇచ్చి ఓ సెటైర్ వదిలారు.
అయితే ఈ వీడియోలో కమలా హారిస్ వేసుకున్న సాక్స్‌పై ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్ (భవిష్యత్తు మహిళలదే) అనే డైలాగ్ ఉంది.ఈ సాక్స్‌ని గంబాల్ పూడిల్ కంపెనీ తయారు చేసింది.వీటి విలువ అమెరికాలో 13 డాలర్లు (భారత కరెన్సీలో రూ.951).ఈ వీడియో పుణ్యమా అని సాక్స్‌కి పెద్ద గుర్తింపు వచ్చింది.దీంతో ఆన్లైన్లో అమెరికన్లు వీటిని ఎడాపెడా కొనేస్తున్నారు.చివరికి ఆర్డర్లు ఎక్కువై డెలివరీ కూడా ఇవ్వలేని పరిస్ధితి నెలకొంది.