అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రోజు రోజుకి పీక్ స్టేజ్ కి వెళ్తోంది.అధ్యక్షుడిగా నాలుగేళ్ళు అమెరికాని పాలించిన ట్రంప్ ఈ నాలుగేళ్ల కాలంలో అమెరికా ప్రజల మన్ననలు పొందటంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి.
ట్రంప్ కి మద్దతుగా అమెరికాలో మెజారిటీ వర్గం లేకపోవడమే ఇందుకు నిదర్శనం.అయితే తాజాగా నవంబర్ లో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ట్రంప్ పై ఇంటా బయట నెలకొన్న అసంతృప్తి ఇప్పుడు ఒక్కసారిగా బయటకి వస్తోంది.
ట్రంప్ అసమర్ధుడు అంటూ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్ధులు డెమోక్రటిక్ పార్టీమాజీ అధ్యక్షులు, కీలక నేతలు తిట్టిపోస్తుంటే అమెరికా ప్రజలు సైతం ట్రంప్ పాలనపై నిప్పులు కక్కుతున్నారు.ఇప్పటికే నల్లజాతీయుల మద్దతు, వలస వాసుల మద్దతు పోగొట్టుకున్న ట్రంప్ అమెరికన్స్ మద్దతు కూడా కోల్పోయారని తెలుస్తోంది.
తాజాగా జరిగిన సర్వేలో ఈ విషయాలు బహిర్ఘతమయ్యాయట.అందుకు తగ్గట్టుగానే అమెరికాలో వాషింగ్టన్ లోని 18 ఏళ్ళ సింగర్ ట్రంప్ పై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు వాషింగ్టన్ లో జరుగుతున్న నేపధ్యంలో బిల్లీ ఎలిష్ అనే సింగర్ అక్కడికి హాజరయ్యారు.ఇదే సదస్సు వేదికపై ఆమె మాట్లాడుతూ అమెరికాని ట్రంప్ సర్వ నాశనం చేశారని అన్నారు.సమర్ధవంతమైన పాలన అమెరికాకి కావాలని, అందుకు ట్రంప్ సరిపడే వ్యక్తి కాదని, ట్రంప్ కి ఓటు వేయద్దంటూ వేడుకుంది. కరోనా పై యుద్ధం చేయగలిగే నాయకత్వం ఇప్పుడు అమెరికాకి అవసరమని అన్నారు.
ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే అమెరికన్స్ తప్పకుండా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధికే ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.