అమ‌రావ‌తి కి మిగిలింది.. మాట‌లేనా..?       2018-06-18   01:04:18  IST  Bhanu C

అమ‌రావ‌తి! ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట‌ల్లో చెప్పాలంటే.. ప్ర‌పంచంలో ప్ర‌త్యేక స్థానంగా నిలిచిపోనున్న ఏపీ రాజ‌ధాని న‌గ‌రం. అలాంటి న‌గ‌రం.. నాలుగేళ్ల‌యినా.. మాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. నిజానికి ఓ రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం నిర్మాణానికి నాలుగేళ్ల స‌మ‌యం చాల‌దు. అయినా.. కూడా చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌నలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. సింగ‌పూర్ త‌ర‌హాలో ఆయ‌న ఈ న‌గ‌రాన్ని నిర్మించాల‌ని భావించారు. అయితే, ఎక్క‌డి క‌క్క‌డే ప‌నులు వెక్కిరిస్తున్నాయి. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ న‌గ‌ర నిర్మాణాన్ని ఓట్లు కుమ్మ‌రించే క‌ల్ప‌వృక్షంగా మార్చుకోవాల‌ని కూడా బాబు భావించారు. కానీ, అది కూడా సాకారం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. నాలుగు మాటలు ఎక్కువ‌. రెండు ప‌నుల‌కు త‌క్కువ అన్న‌ట్టుగానే మారిపోయింది. మ‌రి దీని క‌థా క‌మామీషు ఏంటో చూద్దామా?!

అమరావతిలో నవ నగరాలు, ఐకానిక్‌ టవర్లు, ఐకా నిక్‌ బ్రిడ్జీలు.. వాటర్‌ ఛానళ్లు.. గోల్ఫ్‌ కోర్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటినా అడుగులు మాత్రం అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. రాజధాని ఎక్కడుందో కనపడ్డంలేదు. కొత్త రాజధానిలో నిర్మాణాలు ఒకటి రెండే ఉండగా వివాదాలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. సింగపూర్‌ కంపెనీలతో లాలూచీపడి వేల కోట్ల విలువైన భూములను వారికి అప్పనంగా అప్పగించడం.. భూసమీకరణ పేరుతో నాలుగు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా వాటిని సొంతం చేసుకోవడం వంటి వి నాలుగేళ్లుగా అమరావతికి అడ్డుగా మారాయి.

2014 ఎన్నికల అనంతరం రాజధాని ఎక్కడనే విషయంపై వ్యూహాత్మకంగా లీకులిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా చేజిక్కించుకున్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని తమకు కావల్సిన వారికి మాత్రమే చెప్పారు. దీంతో సీఎం, ఆయన కుమారుడు, వారి కోటరీ వ్యక్తులంతా ఆ ప్రాంతంలో తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఇలా తాము ముందే అనుకున్న ప్రాంతంలో సుమారు 25వేల ఎకరాలను టీడీపీ నాయకులు తక్కువ రేటుకు చేజిక్కించుకున్నారు. తద్వారా రాజధాని పేరుతో ఆయా ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ సృష్టించి సాధారణ, మధ్యతరగతి ప్రజలను తప్పుదారి పట్టించారు.