ఆరు నెలల ఎదురు చూపులకు బన్నీ ఫుల్‌ స్టాప్‌.. ఒక క్లారిటీ వచ్చేసింది   Allu Arjun Next Movie With The Trivikram Srinivas     2018-10-13   09:09:48  IST  Ramesh P

అల్లు అర్జున్‌ హీరోగా ‘నా పేరు సూర్య’ వచ్చి ఆరు నెలలు దాటి పోతుంది. అయినా ఇప్పటి వరకు బన్నీ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే విక్రమ్‌ కుమార్‌తో మూవీ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉంది. కాని నా పేరు సూర్య చిత్రం ఫ్లాప్‌ తర్వాత బన్నీ ప్రయోగాలు చేసేందుకు భయపడుతున్నాడు. ఆ కారణంగానే విక్రమ్‌ కుమార్‌ మూవీని పక్కకు పెట్టాడు. ‘నోటా’ చిత్రాన్ని కూడా బన్నీ కాదన్నాడు. ప్రయోగం వద్దనే ఉద్దేశ్యంతో బన్నీ ఆ సినిమాకు నో చెప్పాడు.

బన్నీ ఆరు నెలలుగా ఏ సినిమా చేద్దాం, ఎవరితో చేద్దాం అంటూ ఆలోచిస్తున్నాడు. త్రివిక్రమ్‌తో ఈయన ఒక చిత్రం చేయాల్సి ఉంది. కాని అజ్ఞాతవాసి ఫలితం నేపథ్యంలో త్రివిక్రమ్‌తో మూవీ అంటే కాస్త టెన్షన్‌ పడ్డాడు. అరవింద సమేత చిత్రం ఫలితాన్ని బట్టి నిర్ణయించుకోవాలని బన్నీ భావించాడు. తాజాగా ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్‌ ఐయామ్‌ బ్యాక్‌ అంటూ కుమ్మేశాడు.

త్రివిక్రమ్‌ భారీ విజయాన్ని ఈ చిత్రంతో సొంతం చేసుకున్న కారణంగా అల్లు అర్జున్‌ వెంటనే త్రివిక్రమ్‌తో మూవీకి సిద్దం అయినట్లుగా సమాచారం అందుతుంది. జనవరిలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కూడా ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాలను నిర్మించిన రాధాకృష్ణ నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

Allu Arjun Next Movie With The Trivikram Srinivas-

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు విజయాన్ని దక్కించుకున్న కారణంగా మూడవ సినిమాతో హ్యాట్రిక్‌ను దక్కించుకుంటారా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించి, అదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ అరవింద ప్రమోషన్‌లో ఉన్నాడు. అల్లు అర్జున్‌ హాలీడేస్‌ ట్రిప్‌లో ఉన్నాడు. త్వరలోనే వీరిద్దరు హ్యాట్రిక్‌ కోసం కలవబోతున్నారు.