ఫ్లాప్‌ మూవీకి విజయోత్సవ వేడుక.. బన్నీ మరీను     2018-07-16   10:51:39  IST  Ramesh Palla

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా నటించిన ‘విజేత’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘విజేత’ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ముందు నిలవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం వసూళ్లలో కనీసం 10 శాతం వసూళ్లు కూడా విజేత రాబట్టలేక పోయాడు అనేది నగ్న సత్యం. విజేత ఎంత దారుణమైన ఫ్లాప్‌ అని చెప్పడానికి దానికి మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్‌ సాక్ష్యం. అలాంటి మూవీకి విజయోత్సవ వేడుక నిర్వహించడం, ఆ కార్యక్రమంలో బన్నీ పాల్గొని ఆహా, ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపించడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

ఆ మద్య సురేష్‌బాబు స్వయంగా టాలీవుడ్‌లో ఫ్లాప్‌ సినిమాలకు విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు, అలా చేయడం వల్ల అసలు సక్సెస్‌ సినిమాలు ఏవి అనే విషయం తెలియడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అలాగే కళ్యాణ్‌ దేవ్‌ మూవీ ‘విజేత’కు చేయడం జరిగింది. సినిమా ఫ్లాప్‌ అంటూ అందరికి తెలిసి పోయింది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా సినిమా ఫ్లాప్‌ అంటూ సన్నిహితుల వద్ద చెప్పేస్తున్నారు. కాని బయటకు మాత్రం సినిమా ఆహా, ఓహో అంటూ మాట్లాడుతున్నారు. అందుకే సినిమాకు సక్సెస్‌ వేడుక నిర్వహించడం జరిగింది.

Allu Arjun Movie Gets Success Meet For 100 Days Function-

Allu Arjun Movie Gets Success Meet For 100 Days Function

‘విజేత’ చిత్రం విజయోత్సవ వేడుకలో అల్లు అర్జున్‌ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నాడు. సినిమా నిజంగా సక్సెస్‌ అయితే ఖచ్చితంగా చిరంజీవి, రామ్‌ చరణ్‌లో వచ్చేవారు. కాని సినిమా సాదా సీదాగా నడుస్తున్న కారణంగా సక్సెస్‌ వేడుకలో పాల్గొంటే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో చిరు, చరణ్‌లు పక్కకు ఉన్నారు. కాని అల్లు అర్జున్‌ బలి అయ్యాడు. చిరంజీవి సూచన మేరకో లేదా ఆదేశాల మేరకో కాని ‘విజేత’ చిత్రం విజయోత్సవ వేడుకలో అల్లు అర్జున్‌ పాల్గొన్నాడు. ఇక పాల్గొన్న తర్వాత సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి కదా. ఆ నాలుగు మంచి మాటల కోసం బన్నీ చాలా వెదుక్కున్నట్లుగా అనిపించింది.

బన్నీ మాట్లాడుతూ.. వచ్చే ముందు విజేత చిత్రాన్ని చూశాను అని, ఒక మంచి సినిమాలా అనిపించింది, తప్పకుండా ఈ చిత్రం కళ్యాణ్‌కు మంచి సినిమాగా నిలిచిపోతుందని అన్నాడు. మొదటి సినిమాతో సక్సెస్‌ దక్కడం అనేది చాలా అదృష్టం అని, అది కళ్యాణ్‌కు దక్కిందని అభినందించాడు. ఇక ఈ చిత్రంలో తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ గురించి బన్నీ ఎక్కువగా మాట్లాడాడు. తనకు ఈ చిత్రం బాగా కనెక్ట్‌ అయ్యిందని, తనకు తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ అంటే చాలా ఇష్టం కనుక ఈ చిత్రం నచ్చింది అంటూ బన్నీ వ్యాఖ్యలు చేశాడు. బన్నీ వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్‌ కూడా ముసి ముసి నవ్వులు నవ్వేస్తున్నారు. ఫ్లాప్‌ మూవీస్‌కు ఇలా విజయోత్సవ వేడుకలు నిర్వహించడం అనేది ఎప్పుడు మారుతాయో అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.