ఆహా.. బన్నీది ఎంత మంచి మనసు       2018-05-14   06:53:44  IST  Raghu V

అల్లు అర్జున్‌ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడు. ఇటీవలే అభిమాని కోసం కన్నీరు పెట్టుకుని గొప్ప వ్యక్తి అనిపించుకున్న అల్లు అర్జున్‌ తాజాగా మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులకు పార్టీ ఇవ్వడంతో మరోస్థాయికి వెళ్లాడు. తాను నటించిన సినిమాకు మహానటి వల్ల నష్టం వాటిల్లినా కూడా ఏమాత్రం అసూయ చెందకుండా ఒక గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందించారంటూ మహానటిని అభినందనలో ముంచెత్తాడు. చిత్ర యూనిట్‌ సభ్యులకు తనవంతు అంటూ పార్టీ ఇచ్చి గౌరవించాడు. వారికి వింధు భోజనం ఏర్పాటు చేయడంతో బన్నీ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్‌ వంటి మంచి మనసు ఉన్న వ్యక్తికి అభిమానులం అయినందుకు గర్వంగా ఉందని ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘నా పేరు సూర్య’ చిత్రం కలెక్షన్స్‌ పర్వాలేదు అన్నట్లుగా వస్తున్న సమయంలో మహానటి దెబ్బకు పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్లు సాధించిన నా పేరు సూర్య చిత్రం మహానటి రావడంతో పూర్తిగా ఢీలా పడిపోయి నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చి పెట్టింది. అయినా కూడా అల్లు అర్జున్‌ ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా మహానటి యూనిట్‌ సభ్యులను గౌరవించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇతరులు మహానటిని గౌరవించడం వేరు తన సినిమా బలి అయినా కూడా మహానటిని గౌరవించి, ఆ సినిమాపై ప్రశంసలు కురిపించడం వేరు. అల్లు అర్జున్‌ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు.

ఇటీవలే మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులను చిరంజీవి సన్మానించాడు. చిత్ర యూనిట్‌ సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించి, ఇదో అద్బుతమైన గొప్ప సినిమా అంటూ వ్యాఖ్యలు చేశాడు. తాను చేసే ప్రతి పనిలో కూడా మెగాస్టార్‌ కనిపించాలని భావించే అల్లు అర్జున్‌ తాజాగా మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులను సన్మానించడం ద్వారా మరోసారి తన మామను ఫాలో అవుతున్నాడనిపించుకున్నాడు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత స్థానంను దక్కించుకునేందుకు ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసే అు్ల అర్జున్‌ తాజాగా మహానటి విషయంలో కూడా అత్యుత్సాహం చూపించాడు అంటూ కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ ‘మహానటి’ యూనిట్‌ సభ్యులను ప్రశంసలతో ముంచెత్తడం వెనుక తన మంచితనంను అందరికి తెలియజేయాలనే ఆశ ఒకటి మరియు చిరంజీవి కూడా తనను అభినందించాలి, చిరంజీవి ఫ్యాన్స్‌ దృష్టిలో తాను పడాలనేది అల్లు అర్జున్‌ ప్లాన్‌గా కొందరు చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్‌ ఎక్కువగా తననే అభిమానించాలని అల్లు అర్జున్‌కు ఉంటుందని, అందులో భాగంగానే మామయ్యను ఫాలో అయ్యి మహానటికి గ్రాండ్‌ పార్టీ ఇవ్వడం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా బన్నీ చేసింది మంచి పని అంటూ ప్రశంసల జల్లు కురుస్తుంది.