నిలదీతలు.. అడ్డగింతలు ! టీఆర్ఎస్ కి ఎదురుగాలి  

Allegations On Trs At Elections Campaigning-

తెలంగాణాలో మళ్ళీ అధికారం దక్కించుకోవాలనే ఆశతో దూకుడుగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద అంత వ్యతిరేకత లేకపోయినా మళ్ళీ సిట్టింగులకే పార్టీ టికెట్ ఇవ్వడంతో ప్రజల్లో వారి మీద ఉన్న వ్యతిరేకత ఇప్పడు గ్రామాల్లో ప్రచారాన్ని అడ్డుకునే స్థాయి వరకు వెళ్ళింది. అసెంబ్లీ రద్దుకు ముందు, తర్వాత అనేక సర్వేలు చేయించుకున్న కేసీఆర్ కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగా తెలుసు..

నిలదీతలు.. అడ్డగింతలు ! టీఆర్ఎస్ కి ఎదురుగాలి -Allegations On TRS At Elections Campaigning

అయినా, కొత్త అభ్యర్థులను ప్రకటించి లేని తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో సిట్టింగులకే టిక్కెట్లు ఇచ్చారు. తన ఇమేజ్ వారిని గెలిపిస్తుందని గట్టిగా నమ్మారు. అయితే, ఇప్పుడు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఈ ప్రభావం గెలుపు ధీమాను ఎక్కడ దెబ్బ తీస్తుందో అన్న ఆందోళన కనిపిస్తోంది.

ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు జనాల నుంచి తీవ్ర నిరసన తగులుతోంది. నాలుగున్నరేళ్లుగా తమను పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ పలువురు అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించ లేదని ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి పార్టీలో సుమారు 20 – 30 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విశ్లేషణలు ముందు నుంచే ఉన్నాయి. అయితే, ఈ వాదనలు కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ ఇమేజ్ ముందు ఇవన్నీ కొట్టుకుపోతాయని, అభ్యర్థులను చూసి కాకుండా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేస్తారని కేసీఆర్ నమ్మారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా మారడంతో కేసీఆర్ ఆందోళన చెందుతున్నాడు..

ప్రతీరోజు ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి నేరుగా అభ్యర్థులతో ఫోన్ మాట్లాడుతూ. ప్రచారంలో అనుసరించాల్సిన వైఖరిపై సూచనలు చేస్తున్నారు.

ఇక కేటీఆర్ అయితే కొత్తగా సర్వే చేయిస్తున్నాడు. ఇలా ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థులకు బీ ఫార్మ్స్ ఇవ్వకుండా నామినేషన్ టైం లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇక తెలంగాణాలో మాహా కూటమి కూడా రోజురోజుకి బలపడుతుండడం టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలవరపెడుతోంది..