అన్నీ పార్టీలకు గెలుపు ధీమా ! ... కానీ టెన్షన్ టెన్షన్ !     2018-12-07   11:56:38  IST  Ramesh P

తెలంగాణాలో పోలింగ్ మొదలయిపోయింది. రాజకీయ పార్టీల భవితవ్యం అంతా ఈ రోజు ఈవీఎం మిషన్ లలో నిక్షిప్తం అయిపోతుంది. ఇక 11 వ తేదీ వరకు అన్ని పార్టీల మధ్య ఒకటే టెన్షన్. ఎవరికి పట్టాభిషేకం ఎవరు ప్రతిపక్షం అనే విషయంలో అందరికి ఆసక్తి తో కూడిన టెన్షన్ మొదలయ్యింది. ఇక ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలో ఓటేశాక ఎవరికి ఓటేశామో చూసుకోవడానికి పక్కనే వీవీపాట్ లను ఏర్పాటుచేశారు. పోలింగ్ జరుగుతున్న తీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మొత్తం వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. అయితే 5 దాటిన తరువాత కూడా… లైన్లో ఉన్న ఓటర్లకు స్లిప్ ఇచ్చి 7 గంటల వరకు ఓటు వేసే విధంగా అవకాశం కల్పించారు.

All Political Parties Have Winning Chances In Telangana-CPI CPM Mahakutami Telangana. TRS TCongress TDP TJS

మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా… అత్యల్ఫంగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆరుగురు మాత్రమే బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు లక్ష మందితో భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పార్టీల విషయానికి వస్తే… అన్ని పార్టీలు గెలుపు ధీమాగానే ఉన్నాయి. ప్రజకూటమిలో ఉన్న కాంగ్రెస్ , టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలన్నీ ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుంది అన్న ఆశతో ఉంది. దీంతో పాటు కూటమిలో పార్టీల మధ్య బలం కూడా తోడయితే అధికారం దక్కడం ఖాయం అనే భావనలో ఉంది.

పార్టీలో జోష్ పెంచేందుకు రాహుల్ గాంధీతో పదికి పైగా సభలు నిర్వహించారు. సోనియా గాంధీ కూడా మేడ్చెల్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఇక జాతీయ పార్టీ నేతలు, పక్క రాష్ట్రాల నేతలు సుమారు 20 మందికి పైగానే తెలంగాణలో సభలు.. సమావేశాలు నిర్వహించి పార్టీకి కొంచెం ఊపు తీసుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే… గెలుపు ధీమాతోనే ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ తొందరపడి మరీ ప్రభుత్వాన్ని రద్దు చేసాడు. సుమారు 80కి పైగా నియోజకవర్గాలను కవర్ చేస్తూ 50కి పైగా బహిరంగ సభలకు ఆయన హాజరయ్యారు. ఒక్కో రోజు ఆయన 6 నుంచి 8 బహిరంగ సభల్లోనూ పాల్గొన్నారు. ఇక కేటీఆర్ ఎక్కువగా హైదరాబాద్ లో, హరీష్ రావు మెదక్ జిల్లాలో, కవిత నిజామాబాద్ జిల్లా బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్ళీ తమను అధికారంలో నిలబెడుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తోంది.

All Political Parties Have Winning Chances In Telangana-CPI CPM Mahakutami Telangana. TRS TCongress TDP TJS

ఇక కేంద్ర అధికార పార్టీ బీజేపీ విషయానికి వస్తే… ముందు నుంచి ఈ పార్టీ అన్ని పార్టీల కంటే వెనకవబడే ఉంది. సాక్ష్యాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి కొంచెం ఊపు తెచ్చారు. కానీ మిగతా పార్టీలతో పోలిస్తే ఆ పార్టీ వెనకబడే ఉందని చెప్పాలి. మొత్తానికి పార్టీల జాతకం తెలిసే రోజు కోసం పార్టీల టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూపులు చూస్తున్నాయి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.