మెప్పు కోసం ముప్పు తిప్పలు ! అన్ని పార్టీలు ఇంతే !       2018-07-08   02:13:53  IST  Bhanu C

రాజకీయ పార్టీల్లో అప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలయిపోయింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా ప్రతి పార్టీ తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో తెలియదు కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనేలా పార్టీలు సిద్ధం అవుతున్నాయి. గ్రామస్థాయి నుంచి కూడా ఈ సందడి స్ప్రష్టంగా కనిపిస్తోంది. ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ కురిపించేస్తున్నారు. అధికార పార్టీ కొత్త కొత్త స్కీమ్ లతో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు చూస్తోంది.

ఇక మిగిలిన పార్టీల అధినేతలు కూడా నిత్యం జనాల్లో తిరుగుతూ తమ తమ పార్టీలకు ప్రజల నుంచి మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తున్న సాధారణ ప్రజలకు మాత్రం అప్పుడే ఎన్నికలు మొదలయిపోయాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. అధికార టీడీపీ తాజాగా ‘గ్రామదర్శిని’, ‘గ్రామ వికాసం’ పేరిట 75 రోజుల పాటు గ్రామాల్లో ఇంటింటి ప్రచారానికి నిర్ణయించింది. ప్రతిపక్ష వైసీపీ బూత్‌స్థాయిలో బలోపేతమవడానికి సిద్ధమవుతూనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోంది. జనసేన అధ్యక్షుడు కూడా ప్రజల్లోనే ఉండి మిగిలిన పార్టీల మీద పంచ్ డైలాగులు వేస్తున్నాడు . ఇక బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా రంగంలోకి దిగారు

నాలుగేళ్లలో జన్మభూమి కార్యక్రమాలు, సైకిల్‌ యాత్రలు, ఇంటింటికీ టీడీపీ, నవనిర్మాణ దీక్షలు ఇలా పలు కార్యక్రమాలతో టీడీపీ ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ నెల 16 నుంచి చేపడుతున్న గ్రామదర్శినిలో భాగంగా సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రభుత్వం ఇంకా ఏం చేయబోతోంది… అనే అంశాలతో విస్తృత ప్రచారానికి సిద్ధమైంది.

వైసీపీ విషయానికి వస్తే… ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.అందుకే.. జిల్లా కేంద్రంలో ప్లీనరీ, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. పల్లెనిద్ర పేరిట గ్రామాల్లో నాయకులు తిరుగుతున్నారు. వైసీపీ అధినేత చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇటీవలే జిల్లాలో పూర్తవడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఏ అవకాశాన్ని వదలకుండా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే పనిలో బిజీగా ఉన్నారు.

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ తమ ఉనికిని చాటుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ మిత్రబంధం బెడిసికొట్టడంతో బీజేపీ బలం పెంచుకునే దిశగా పా వులు కదుపుతోంది. ఇక జనసేనకు సంబంధించి పార్టీ స్పష్టమైన నిర్మాణం లేనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎన్నోకాన్ని సీట్లు సంపాదించాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది.