భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న సంగతతి తెలిసిందే.రోజురోజుకు ఇక్కడ కొత్త కేసులు, మరణాల సంఖ్య రికార్డుల్ని బద్ధలు కొడుతోంది.
ఈ నేపథ్యంలో భారత్‌కు ప్రయాణం చేయాలంటేనే విదేశీయులు వణికిపోతున్నారు.అటు ఇండియా నుంచి వచ్చే విమానాలపైనా ఆయా దేశాలు నిషేధం విధించాయి.
న్యూజిలాండ్, ఫ్రాన్స్, కెనడా, యూఏఈ, యూకే , అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే.
అమెరికా అయితే ఏకంగా భారత్‌లో ఉన్న తమ పౌరులను వెనక్కి వచ్చేయమని హెచ్చరించింది.
వైరస్ తీవ్రత నేపథ్యంలో వీలైనంత తొందరగా ఇండియాను వీడటం సురక్షితమని పౌరులకు విజ్ఞప్తి చేసింది.ఇక యూకే సైతం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఈ ఆంక్షల కారణంగా యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.ఏప్రిల్ 24 నుంచి 30 వరకు భారత్-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

అయితే విద్య, ఉద్యోగ, వ్యాపారాలు సహా వివిధ అవసరాల కోసం భారతీయులు ఎక్కువగా ఆధారపడే దేశాలు కావడంతో ఈ నిషేధం కారణంగా అటు ఇటూ చిక్కుకుపోయిన వారు లక్షల్లో వున్నారు.వీరంతా ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.భారత్‌లో ఇప్పుడప్పుడే కోవిడ్ ఉద్ధృతి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయా అన్న భయాలు నెలకొన్నాయి.ఇలాంటి పరిస్ధితుల్లో భారత ప్రభుత్వ రంగ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా తీపి కబురు చెప్పింది.
రేపటి (మే 1) నుంచి యూకేకి విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.భారత్‌లోని ప్రధాన నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్రూ విమానాశ్రయానికి సర్వీసులు నడుపుతామని పేర్కొంది.
మే 1 నుంచి 15 వరకూ పాక్షిక సేవలు అందించిన అనంతరం పరిస్ధితిని సమీక్షించి సర్వీసుల కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్వీట్ చేసింది.