అజ్ఞాతవాసి ఎందుకు ఆదరణకి నోచుకోలేదంటే     2018-01-11   06:04:36  IST  Raghu V

త్రివిక్ర‌మ్-ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన‌గానే స‌గ‌టు సినీ అభిమానికి గుర్తొచ్చే చిత్రం అత్తారింటికి దారేది. అంత‌కుముందు ఈ ఇద్ద‌రు జ‌ల్సా చేసిన‌ప్ప‌టికీ రికార్డులన్నీ అత్తారింటి దారే ప‌ట్ట‌డంతో ఆ చిత్రం ప్రేక్ష‌కుల మ‌దిలో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంది. అంచేత వారిద్ద‌రి క‌ల‌యిల‌కలో మ‌రో చిత్రం రూపుదిద్దుకోవ‌డం ఆనందించే విష‌య‌మే అయినా క‌థ‌లో ఐశ్వ‌ర్య‌వంతుడైన ఒక వ్య‌క్తి ఒకానొక కార‌ణం కోసం త‌న స్థానాన్ని, స్థాయినీ వ‌దిలి వుండ‌టం వంటి కీల‌క విష‌యాలు గ‌త చిత్రాన్నే క‌ళ్ళముందు మెదిలేలా చేస్తాయి. అటు తండ్రిని చంపిని వారిని వెతికి ప‌ట్టుకునే క్ర‌మంలోనూ హాస్యానికే పెద్ద‌పీట వేయ‌డం భావోద్వేగాల తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికే అన్న‌ట్టుంది. అందులో అల్లిన ప్రేమ క‌థ మ‌రీ పేల‌వం. ఆ త‌తంగ‌మంతా నాట‌కీయంగా అనిపించ‌డ‌మే కాక చివ‌రికి క‌థానాయ‌కుడు ఎవ‌రితో ముడిప‌డ‌తాడ‌న్న‌ది ప్ర‌శ్న‌గానే వ‌దిలేశాడు ద‌ర్శ‌కుడు.

తండ్రి నిర్ణ‌యం ప్ర‌కారం క‌థానాయ‌కుడు అజ్ఞాతంలో వుండ‌టం అన్న‌ది చిత్ర క‌థాంశం. అయితే ప్రేక్ష‌కుడికి దానికి సంబంధించిన స‌న్నివేశాల‌కంటే తండ్రి చావుకు గల కారణాల కోసం జరిపే వెతుకులాట‌లోనూ పండించే వినోద‌మే గుర్తుంటుందన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అదీ పూర్తిస్థాయి హాస్యం అనిపించుకోక‌పోవ‌డం మ‌రో జంధ్యాల‌గా పేరొందిన త్రివిక్ర‌మ్‌కు ఓ మ‌చ్చ‌. చిత్రంలో పాట‌లకు గ‌ల సంద‌ర్భం సాహిత్యం అందించిన క‌వుల‌కు చెప్పి, తెర‌పై చూసే ప్రేక్ష‌కుడికి చెప్ప‌డం మ‌రిచారు కాబోలు. క‌థ‌లో కీల‌క అంశాల‌ను రెండు భాగాలుగా చూపించ‌డం కూడా ఏదో జ‌రుగుతున్న‌ట్టు భ్ర‌మించ‌పేసే ప్ర‌య‌త్న‌మే. దానికి కొన‌సాగింపుగా క‌థానాయ‌కుడి మేన‌మామ (త‌నికెళ్ళ భ‌ర‌ణి) అత‌డిని మోసం చేయాల‌నుకోవ‌డం, క‌థానాయిక‌ల పాత్ర‌లు కూడా నిడివిని పెంచ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయి. భాగ‌స్వాములుగా చిత్రంలో కీలక పాత్ర‌లు పోషించిన రావు ర‌మేష్‌, మురళి శ‌ర్మ సహా కుష్భు న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. అదే స‌మ‌యంలో క‌థానాయ‌కుడి పాత్ర తీరు మామూలు ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు. పోలీస్ అధికారిగా సంప‌త్, త‌న‌ ఊహ‌ల‌ ద్వారా చిత్రంలోని ఓ ముఖ్య ఘ‌ట్టాన్ని చెప్ప‌టానికే వ‌చ్చార‌నిపిస్తుంది. ఆ పాత్ర‌కు స‌రైన ముగింపు కూడా లేకుండా పోయింది.