ఒక షాపులో తాత-మనవడు మధ్య జరిగిన ఈ సంభాషణ చూస్తే మీరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు!

‘పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ.పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని.

 A Conversation Between Grandfather And Grandson In Shop-TeluguStop.com

తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు.పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట.

అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి.మన బుద్ధి వికసిస్తుంది.

దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది.అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.

‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ.ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు.తెలివి తేటలున్నవాడు.చదువులోనూ ఆటల్లోనూ ముందే.ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.

ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు.

ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ.ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు.

వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు.తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్య, రమణ.

వరుసలో ముందున్న వ్యక్తికి వంద గ్రాముల జీడిపప్పు కావాలంటే సీసాలోంచి జీడిపప్పు తీసి, సిబ్బిలో వేసి తూకం వేస్తున్నాడు దుకాణదారు.కొనడానికి వచ్చిన వ్యక్తి సిబ్బిలోంచి నాలుగు జీడిపప్పు పలుకులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.

అతనికి జీడిపప్పు పొట్లం కట్టిచ్చి డబ్బులు తీసుకున్నాడు దుకాణదారు.ఆ తరువాత ఉన్న వ్యక్తి కూడా వంద గ్రాముల జీడిపప్పు కావాలని అడిగితే… దుకాణదారు సిబ్బిలో జీడిపప్పు వేసి తూకం వేస్తున్నాడు.

జీడిపప్పు కొంటున్న వ్యక్తి సిబ్బిలో నుంచి నాలుగైదు జీడిపప్పు పలుకులు తీసుకుని నోటిలో వేసుకున్నాడు.

‘అదేమిటండీ… మీరు అలా తీసుకుని తింటే మాకు నష్టం కదా’ అంటూ మందలించాడు అతనిని దుకాణదారు.జీడిపప్పు పొట్లం కట్టి ఇచ్చి డబ్బులు తీసుకుంటూ.

ఇది గమనించిన తాతయ్య… ‘ఆ ఇద్దరు వ్యక్తులూ సిబ్బిలోంచి జీడిపప్పులు తీసుకుని తిన్నారు కదా! దుకాణదారుడు మొదటి వ్యక్తిని ఏమీ అనలేదు.

కానీ రెండో వ్యక్తిని జీడిపప్పు తీసుకుని తిన్నందుకు మందలించాడు.ఎందుకో చెప్పగలవా?’ అని ప్రశ్నించాడు రమణని.‘అదే నాకూ అర్థం కావడం లేదు తాతయ్యా!’ అన్నాడు రమణ.‘అయితే అక్కడ జరిగింది నువ్వు శ్రద్ధగా గమనించలేదన్నమాట.సరే చెబుతా విను ఏం జరిగిందో.మొదటి వ్యక్తి జీడిపప్పు తూకం వెయ్యడం పూర్తయిన తరువాత పొట్లం కట్టి ఇచ్చే ముందు మాత్రమే పొట్లం నుంచి జీడి పప్పులు తీసుకుని తిన్నాడు.

అంటే అతను తిన్నదానికి డబ్బు చెల్లించినట్టే.అందువల్ల దుకాణదారుడికి జరిగిన నష్టం ఏమీ లేదు.కానీ రెండో వ్యక్తి తూకం జరుగుతుండగానే సిబ్బిలోంచి జీడిపప్పులు తీసుకుని తిన్నాడు.అందువల్ల దుకాణదారుడికి నాలుగైదు జీడిపప్పుల ధర నష్టమే కదా! అందుకే అతను ఆ వ్యక్తిని మందలించాడు’ అంటూ జరిగింది వివరంగా చెప్పాడు తాతయ్య.

‘నిజమే తాతయ్యా! నేనా విషయం గమనించలేదు.ఇకపై ప్రతీ విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించడం అలవాటు చేసుకుంటా’ అన్నాడు రమణ.‘ఉదయం నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూశావు కాబట్టి ఇకపై నువ్వు అన్నింటినీ పరిశీలించి చూస్తావని నాకు తెలుసు’ అన్నాడు తాతయ్య చిరునవ్వుతో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube